ఢిల్లీపై ఎమ్మెల్యేల కన్ను
హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు హుళక్కే అనుకుంటున్న సిట్టింగ్ లు లోక్ సభలో అడుగు పెట్టేయాలనుకుంటున్నారు. వీరిలో సొంత సెగ్మెంట్లు రద్దయిన వారు కొందరైతే, పార్లమెంటుకు వెళ్దామనుకుంటున్న వారు మరి కొందరు, సొంత పార్టీలో ప్రత్యర్ధులకు ఎంపి టిక్కెట్ దక్కనివ్వకూడదని కుయుక్తులు పన్నుతున్న వారు ఇంకొందరు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపి స్థానం దక్కించుకోవాలని ఆశిస్తున్న ఉంగుటూరు ఎమ్మెల్యే వట్టి వసంత కుమార్, ఏలూరు లోక్ సభ స్థానంపై కన్నేసిన దెందులూరు ఎమ్మెల్యే మాగంటి వెంకటేశ్వర రావు లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకో వచ్చు. అక్కడి సమీకరణాలను పరిశీలిస్తే, నర్సాపురం అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టిక్కెట్ ప్రసాదరాజుకు ఖాయమని అందరూ అనుకుంటున్నందు వల్ల లోక్ సభ టిక్కెట్ అదే కులానికి చెందిన వారికి దక్కకపోవచ్చట. అందువల్ల ఈసారి తాను పోటీ చేసి ఢిల్లీ వెళ్లాలని వసంత కుమార్ ఆశిస్తున్నారట. అత్తిలి సెగ్మెంట్ రద్దుకావడంతో ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రంగనాధ రాజు, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు కూడా నర్సాపురం వైపే చూస్తున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ ఈసారి పోటీ అసెంబ్లీకా లేక గతంలో మాదిరిగా పార్లమెంటుకా అన్న ఆలోచనలో ఉన్నారట. కాంగ్రెస్ అధిష్టానవర్గం మాత్రం కొణతాలను లోక్ సభకు పంపాలని అనుకుంటోందని భోగట్టా. విజయనగరం జిల్లా సతివాడ శాసన సభ్యుడు, మాజీ మంత్రి పి. సాంబశివ రాజు వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారని తెలిసింది. సుమారు నాలుగు దశాబ్దాలు శాసన సభ్యుడుగా వున్న రాజుగారి దృష్టి ీసారి విజయనగరం పార్లమెంటు స్థానంపై పడింది. ఈ సంగతి ్ప్పుడే ముక్యమంత్రి రాజశేఖర రెడ్డికి కూడా చేప్పేశారట. ఎస్.కోట ఎమ్మెల్యే కుంభా రవిబాబు అరకు లోక్ సభ స్థానానికి, మంత్రి గొల్లపల్లి సూర్యారావు అమలాపురం లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. సూర్యారావు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లవరం అసెంబ్లూ నియోజకవర్గం రద్దవడం, అమలాపురం ఎంపి హర్షకుమార్ కు మళ్లీ టిక్కెట్ రాకపోవచ్చన్న సందేహం గొల్లపల్లి దృష్టిని లోక్ సభ వైపు మళ్లించాయి. ముమ్మిడివరం ఎస్సీ రిజర్వుడు స్థానం ఈసారి జనరల్ కేటగిరీకి మారిపోవడంతో, అక్కడి ప్రస్తుత శాసన సభ్యుడు విశ్వరూప్ దృష్టి కూడా అమలాపురం వైపే ఉందట.
Pages: 1 -2- News Posted: 25 February, 2009
|