'కాంగ్రెస్ కు కాంగ్రెసే శత్రువు'
న్యూఢిల్లీ: ప్రాంతీయ సెంటిమెంట్లను కూడా గౌరవిస్తూనే పాలన సాగించగలిగే జాతీయ పార్టీ దేశానికి అవసరమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీి ప్రకటించారు. ఇలా చేయగలిగిన పార్టీ కాంగ్రెసే అని ఆమె చెప్పారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన సోనియా గాంధి కాంగ్రెస్ కు కాంగ్రెసే తరచు శత్రువు అవుతుంటుందని విచారం వెలిబుచ్చారు. పార్టీ మధ్య ప్రదేశ్ శాఖలో అంతర్గత కలహాలను సోనియా ఈ సందర్భంగా అన్యాపదేశంగా ప్రస్తావించారు. క్రితం సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో ఈ అంతర్గత వైషమ్యాల వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది.
రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాలంటే మరింత క్రమశిక్షణ పాటించాలని, సంఘటితంగా వ్యవహరించాలని పార్టీ కార్యకర్తలను సోనియా కోరారు. 'మనమంతా కలసికట్టుగా వ్యవహరిస్తే తిరిగి అధికారంలోకి రాగలం' అని సోనియా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఆవిష్కరిస్తూ అన్నారు. 14వ లోక్ సభలో ఇదే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చివరి సమావేశం. కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి రెండు సవాళ్ళ గురించి కూడా ప్రస్తావించారు. సమాజాన్ని విభజించడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) రూపొందిస్తున్న వ్యూహం ఒకటి కాగా, స్థానిక సమస్యలపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రాంతీయ పార్టీల యత్నాలు రెండవ సవాల్. అయితే, ఈ రెండవ సవాల్ గురించి ఆమె వివరంగా మాట్లాడలేదు.
పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు రాజకీయంగా వెలితిని కలిగించిన, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లో భాగంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను సోనియా నేరుగా విమర్శించకుడా, 'మనం ప్రజల వద్దకు వెళ్ళి ప్రాంతీయ, స్థానిక సెంటిమెంట్లకు సమాన ప్రాముఖ్యం ఇచ్చే జాతీయ పార్టీ ఇప్పుడు ఇండియాకు ఎంతో అవసరమని నచ్చజెప్పాలి' అని ఉద్బోధించారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|