తమ్ముడి స్టైలే వేరు!
హైదరాబాద్: సినిమాల్లోనే కాదు ఎన్నికల ప్రచారంలో కూడా తన స్టైల్ వేరంటున్నారు యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించబోతున్నారు. తెలంగాణా జిల్లాల్లో పర్యటింస్తున్నప్పుడు గీత కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాగానే ఉంది. అదే సమయంలో వారిచ్చిన కల్లును గ్లాసు దించకుండా తాగేసి, 'తాగితే తప్పేముంది?' అంటూ ఎదురు ప్రశ్నవేశారు. తెలంగాణాలో ఉత్సవాల సందర్భంగా కల్లును దేవతలకు నైవేద్యంగా పెట్టి తీర్థంగా పుచ్చుకోవడం సంప్రదాయం. అయితే 'పవన్ కల్యాణ్ పచ్చి తాగుబోతు. రోజులో ఓ పూటంతా తాగి పడుక్కుంటాడు' అని ప్రత్యర్ధులు చేసిన విమర్శను తిప్పికొట్టాలనుకున్న ఆయన మద్య నిషేధంలో మాట తప్పిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని భావించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా సంపూర్ణ మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని పార్టీ తరఫున వాగ్దానం చేసేశారు.
పార్టీ పెద్దలను కూడా సంప్రదించకుండా పవన్ కల్యాణ్ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు కార్యకర్తలను, అభిమానులను తీవ్రంగా ఉత్తేజపరుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆయన సామాజిక దృక్పథానికి అవి తార్కాణాలని అందరూ ప్రశంసిస్తున్నారు. తెలంగాణలో విస్తృతంగా పర్యటించి పార్టీకి మద్దతు కూడగట్టిన పవన్ ఇప్పుడు కోస్తా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గత కొంత కాలంగా వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు చిరంజీవిపై చేస్తున్న విమర్శలను అక్కడినుంచే పవన్ తిప్పికొడుతున్నారు. అన్ని జిల్లాలు, ప్రాంతాలు తమకు సమానమేనని, గోదావరి జిల్లాల అభివృద్ధి విషయంలో తమకు స్పష్టమైన అభిప్రాయం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రులందరూ సొంత జిల్లాలనే బాగుపరచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే గోదావి జిల్లాలతో పాటు అన్ని జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి సమగ్రమైన ప్రణాళికలను అప్పుడే సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 26 February, 2009
|