ట్వంటీ సిరీస్ విజేత కివీస్
వెల్లింగ్టన్: ట్వంటీ20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతకు మరోసారి భంగపాటు తప్పలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆఖరి ఓవర్ చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ కొట్టిన షాట్ కు బంతి గాలిలోకి లేచిపోయింది కాని క్యాచ్ కోసం ప్రయత్నించిన రోహిత్ శర్మ దానిని పట్టుకోలేకపోయాడు. క్రితంసారి లాగే ఈ రోజు కూడా టాస్ ఓడిపోవడంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అయితే ఈసారి లక్ష్యం బాగా తగ్గిపోయింది. ఇరవై ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ ఇన్నింగ్స్ లో 19.5 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. 18వ ఓవర్ లో ఇర్ఫాన్ పఠాన్ రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆ ఓవర్ రెండో బంతి రాస్ టేలర్ ను క్లీన్ బౌల్డ్ చేయగా, ఆ తరువాత బంతికి జాకబ్ ఓరమ్ డకౌట్ అయ్యాడు. అయితే అదే ఓవర్ లో మెకల్లమ్ రెండు ఫోర్లు కొట్టడంతో కివీస్ లక్ష్యానికి మరింత చేరువ అయ్యారు.
మొదటి మ్యాచ్ హీరో, న్యూజిలాండ్ వికెట్ కీపర్, ఓపెనర్ మెకల్లమ్ ఈసారి కూడా అర్ధ సెంచరీ చేసి ఓ వైపు వికెట్ ను కాపాడుకుంటూ వచ్చాడు. రాస్ టోలర్ తో కలసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. అంతకుముందు జెస్సీ రైడర్ ఇర్ఫాన్ పఠాన్ బంతికి బౌల్డ్ కావడంతో మ్యాచ్ ఇండియా కు అనుకూలంగా మలుపు తిరిగింది. అయితే అప్పటికే మెకల్లమ్ తో కలసి రైడర్ నాలుగు ఓవర్లలో 45 పరుగులు సాధించాడు. ఓపెనింగ్ జంట 53 పరుగులు పూర్తి చేశాక, 15 బంతుల్లో 26 పరుగులు చేసిన రైడర్ ఔటయ్యాడు. ఆ తరువాత మార్టిన్ గుప్టిల్(10)ను హర్భజన్ సింగ్ రిటర్న్ క్యాచ్ పట్టుకుని పెవిలియన్ కు పంపాడు.
Pages: 1 -2- News Posted: 27 February, 2009
|