వరల్డ్ కప్ లో రాణిస్తాం
ముంబాయి: ఆస్ట్రేలియాలో మార్చి 7 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భారత మహిళల జట్టు విజయాలు సాధిస్తుందని, గత సంవత్సరం ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా(5-0)ఓడిపోయినప్పటికీ ఈసారి బాగా ఆడతామని కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి చెప్పింది. ఆస్ట్రేలియా పర్యటనలో సరైన సమయంలో బ్రేక్ త్రూలు సాధించలేకపోయామని, అలాగే బ్యాటింగులో కూడా విఫలమయ్యామని, ఇప్పుడు ఆ లోపాలు సరిదిద్దుకున్నామని, ప్రపంచ కప్ పోటీల్లో బాగా ఆడతామని పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ ఆమె చెప్పింది.
ప్రస్తుత భారత మహిళా క్రికెట్ జట్టు సమతూకంగా ఉందని ఝులన్ చెబుతూ, అనుభవం గల క్రీడాకారిణులు, యువ క్రీడాకారిణులు జట్టులో ఉన్నారని, ముగ్గురు మాత్రమే ఇంతవరకూ విదేశీ పర్యటను వెళ్లలేదన్నది. బెంగుళూరులోను ఇక్కడ అవసరమైన మేరకు ప్రాక్టీసు చేశామని, ఇక అక్కడి వాతావరణానికి, పిచ్ లకు అలవాటుపడితే అనుకున్న ఫలితాలు సాధించగలమని చెప్పింది. సోమవారం ఉదయం ఆస్ట్రేలియా చేరుకోనున్న భారత జట్టు, మార్చి 7న పాకిస్తాన్ తో మొదటి మ్యాచ్, బౌరాల్ లోని బ్రాడ్ మన్ ఓవల్ లో, ఆడుతుంది. మార్చి 10న నార్త్ సిడ్నీలో ఇంగ్లండ్ తోను, 12న బ్యాంక్స్ టౌన్ లో శ్రీలంక తోను ఆడుతుంది.
Pages: 1 -2- News Posted: 28 February, 2009
|