పోస్టర్లపై రాహుల్ గరం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎన్నికల పోస్టర్లలో రాహుల్ గాంధీ చిత్రం కనిపించదు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫోటోలు మాత్రమే పోస్టర్లలో చోటు చేసుకుంటాయి. అయితే, సోనియా, మన్మోహన్, రాహుల్ ముగ్గురితో లేదా దేశ 'భవిత'కు ప్రతీకగా రాహుల్ ను సూచిస్తూ ఆయన ఒక్కరి ఫోటోతో పార్టీ ప్రచార విభాగం విడుదల చేసిన తొలి పోస్టర్లను చూసి రాహుల్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇరకాట స్థితిని ఎదుర్కొన్నారు' అని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్టీకి సారథ్యం వహిస్తారని తాను పదేపదే స్పష్టం చేసినప్పటికీ భారతదేశ భావి ప్రధానిగా తనను ఎందుకు అభివర్ణిస్తున్నారో అమేథి ఎంపి రాహుల్ కు 'అంతుపట్టడం' లేదు.
దేశ భవితకు ప్రతీకగా రాహుల్ ను సూచిస్తూ పోస్టర్లకు రూపకల్పన చేసింది పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, విదేశాంగ, సమాచార, ప్రసార శాఖల సహాయ మంత్రి ఆనంద్ శర్మ అని తెలిసింది. ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దిగ్విజయ్ రాహుల్ కు సన్నిహితుడయ్యారు. దిగ్విజయ్, ఆనంద్ శర్మ ఇద్దరూ పార్టీ ప్రచార విభాగంలో సభ్యులు. ఇక మీదట పోస్టర్లలో రాహుల్ ఫోటో పొందుపరచకూడదని పార్టీ ఎన్నికల ప్రచార నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. కాగా, పార్టీ ప్రచారంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వ్యక్తిత్వాలను ప్రధానంగా ప్రస్తావించడం కన్నా ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) 'సిద్ధాంతాలు, విధానాలు, కార్యక్రమాల'పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
మన్మోహన్ సింగ్, సోనియాల వ్యక్తిత్వాల గురించిన ప్రచారాన్ని ఆచితూచి చేయనున్నారు. తన ఎన్నికల ప్రచారం అమెరికన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని పోలి ఉండకూడదని కాంగ్రెస్ భావిస్తున్నది. ఎందుకంటే 2004లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అటల్ బిహారి వాజపేయిని కేంద్రంగా చేసుకుని ప్రచారం సాగించి, ఆయనకు 'సరితూగే' ప్రధాని అభ్యర్థిని సూచించవలసిందిగా కాంగ్రెస్ ను సవాల్ చేసింది. 'సరైన రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేయాలి. మరీ తక్కువగా ఉండరాదు. అతీ పనికిరాదు' అని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 'మరీ అతిగా ప్రచారం చేస్తే వోటర్లు చిరాకు పడతారు. మరీ తక్కువగా ప్రచారం చేస్తే వారు అయోమయానికి గురవుతారు. అసలు సదరు వ్యక్తి పార్టీకి, ప్రభుత్వానికి సారథ్యం వహించగలరా, లేక ఉన్నట్లుండి ఎవరో అనామకుడు ఊడిపడతారా అని వారు అనుకుంటారు' అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|