బావ, మరుదుల రాజకీయం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు జడ్.పి.టి.సి ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యతను ఆపాదిస్తూ మంత్రి పదవి నుంచి తొలగించిన మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) ఈ నెల 5న తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరడానికి, ద్వారకా తిరుమల నుంచి అభిమానులతో కలిసి భారీ ఊరేగింపుతో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దానికి ముందే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారు. ఉప ఎన్నిక తరువాత నుంచి ఆయన కాంగ్రెస్ లో అనేక అవమానాలకు గురయ్యారని, వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే విషయమై పార్టీ ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. దీంతో బాబు పార్టీ మారతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తెలుగుదేశంలో చేరతారని కొన్నాళ్లు, ప్రజారాజ్యంలో చేరవచ్చని కొన్నాళ్లు అనుకున్నారు.
వంశ పారంపర్యంగా తమ కుటుంబం కాంగ్రెస్ కే పరిమితమయిందని, తాను కూడా పార్టీ మారేది లేదని బాబు చెబుతూ వచ్చారు. అయితే ఆయన బావమరిది, సిఆర్ రెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు ఆయనను తెలుగుదేశంలో చేర్పించడానికి ప్రయత్నించారట. ఏలూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీచేయాలని అంతకుముందే ప్రయత్నించిన రాంబాబు, తనకు ఏలూరు ఎంపి సీటు, మాగంటి బాబుకు దెందులూరు అసంబ్లీ సీటు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి ప్రతిపాదించారు. అయితే బాబు ఏలూరు స్థానంపై ఆసక్తి చూపడంతో, తాను దెందులూరుకు మారాలని రాంబాబు నిర్ణయించుకున్నారు.
Pages: 1 -2- News Posted: 1 March, 2009
|