వన్డేల్లో ఇండియా బోణీ
నేపియర్: 'టర్బొనేటర్' హర్భజన్ సింగ్ స్పిన్ మాయాజాలంలో కివీస్ బ్యాట్స్ మెన్ కు ఊపిరాడలేదు. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో భజ్జీ మూడు కీలకమైన వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ 53 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన దాడికి సానుభూతిగా భారత ఆటగాళ్లు చేతులకు నల్ల బ్యాండ్ లు కట్టుకున్నారు. కివీస్ బ్యాట్స్ మెన్ లో మార్టిన్ గుప్టిల్ ఒక్కడే వీరోచితంగా ఆడి 64 పరుగులకు హర్భజన్ బంతికి ఔటయ్యాడు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ కూడా చక్కటి నియంత్రణతో బంతులు వేసి ప్రత్యర్ధులు సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయేలా చేశారు. కెప్టెన్ డేనియల్ వెట్టోరి 26(నాటౌట్)పరుగులు చేశాడు.
చాలా రోజుల తరువాత మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్న పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ ప్రత్యర్ధుల టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ముప్పతిప్పలు పెట్టాడు. ట్వంటీ మ్యాచ్ ల హీరో బ్రెండన్ మెకల్లమ్ డకౌట్ కాగా, రెండో ఓపెనర్ జెస్సీ రైడర్ 11 పరుగుల తరువాత ప్రవీణ్ కుమార్ బంతికే పెవిలియన్ కు తిరిగి చేరుకున్నాడు. తరువాత బ్యాట్స్ మన్ రాస్ టేలర్(31) సెటిల్ అవుతున్నాడనగా యూసుఫ్ పఠాన్ అతడి ఆట సాగనివ్వలేదు. అంతకు ముందు ధోని సేన బ్యాటింగ్ లో రాణించి, ఇన్నింగ్సుకు కేటాయించిన 38 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. చిచ్చర పిడుగు సెహ్వాగ్(77), వన్డే కింగ్ యువరాజ్ సింగ్(2-రనౌట్)ల నిష్క్రమణ తరువాత 39 బంతుల్లో సురేష్ రైనా 66 పరుగులు చేసి భారీ స్కోరుకు కారకుడయ్యాడు.
Pages: 1 -2- News Posted: 3 March, 2009
|