ఫస్ట్ లిస్ట్ లోనే కళంకితులు!
న్యూఢిల్లీ: మన రాజకీయాలు ఏవిధంగా నేరమయం అయ్యాయో చెప్పేందుకు ఇదిగో నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలలో నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల పేర్లు కనీసం 18 చోటు చేసుకున్నాయని రాజకీయ జీవితంలో రుజువర్తనం కోసం పాటుపడే ఎన్ జిఒ 'నేషనల్ ఎలక్షన్ వాచ్' (ఎన్ఇడబ్ల్యు - న్యూ) వెల్లడించింది. వారిలో నలుగురు కాంగ్రెస్ కు, ఎనిమిది మంది బిజెపికి, ఆరుగురు ఎస్ పికి చెందినవారు. ఇది ప్రారంభం మాత్రమే. పార్టీల పూర్తి అభ్యర్థుల జాబితాలు ఇంకా వెలువడవలసి ఉంది కదా!
'కళంకిత' అభ్యర్థులలో ఎస్ పి అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, రాజకీయ నాయకుడుగా మారిన నటుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న రాజ్ బబ్బర్, బిజెపి నుంచి అనంత కుమార్, రమాకాంత్ యాదవ్, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. క్రిమినల్ బెదరింపు నుంచి చంపుతాననే బెదరించడం, ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యం, అల్లర్లు లేవదీయడం వరకు వారిపై ఆరోపణలు నమోదై ఉన్నాయి. వాస్తవానికి సిద్ధూను ఒక హత్య కేసులో దోషిగా నిర్థారించారు. అయితే, అతనికి విధించిన శిక్షపై స్టే మంజురైంది.
మూడు పార్టీలు ఇంతవరకు ప్రకటించిన 169 మంది అభ్యర్థులలో 71 మంది దాఖలు చేసిన పూర్వ చరిత్రకు సంబందించిన అఫిడవిట్లను 'న్యూ' పరిశీలించింది. కాంగ్రెస్ 24 మంది, బిజెపి 92 మంది, ఎస్ పి 53 మంది అభ్యర్థుల పేర్లను ఇంతవరకు ప్రకటించాయి.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|