డాక్టరేట్లు మీ ఇష్టమేనా?
న్యూఢిల్లీ: జమియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం క్రితం సంవత్సరం నటులు షబానా అజ్మి, నసీరుద్దీన్ షా, తదితరులకు ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ల చెల్లుబాటును రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సవాల్ చేశారు. విశ్వవిద్యాలయం నిబంధనలను ఉల్లంఘించిందని రాష్ట్రపతి ఆరోపించారు. ఈ గౌరవ డాక్టరేట్లను ఇప్పుడు గుర్తించాలని అభ్యర్థిస్తూ విశ్వవిద్యాలయం పంపిన లేఖను రాష్ట్రపతి కార్యాలయం వాపసు చేసిందని, కేంద్ర విశ్వవిద్యాలయాలకు 'విజిటర్' అయిన రాష్ట్రపతిని తొలుత ఎందుకు అలక్ష్యం చేశారని రాష్ట్రపతి కార్యాలయం ప్రశ్నించిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ఆమోదముద్ర లేకపోతే ఆ డిగ్రీలు అధికారికంగా చెల్లుబాటు కావు.
ముందు అనుమతి తీసుకోవలసిన ప్రక్రియకు ఇప్పుడు ఆమోదముద్ర వేయడానికి రాష్ట్రపతి నిరాకరించడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) మంత్రిత్వశాఖకు నోట మాటరాని స్థితి ఏర్పడింది. మన దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతికి సంజాయిషీ ఇచ్చుకోవడానికి మంత్రిత్వశాఖ తంటాలు పడుతున్నది. కేంద్ర విశ్వవిద్యాలమైన జమియా బాధ్యత మంత్రిత్వశాఖదే. డిగ్రీలు మంజూరు చేసేటప్పుడు నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారో సంజాయిషీ ఇవ్వవలసిందని రాష్ట్రపతి కార్యాలయం మంత్రిత్వశాఖను కోరింది. జమియా వైస్ చాన్స్ లర్ ముషీరుల్ హసన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.
అయితే, రాష్ట్రపతి ఆరోపణలు సరైనవేనని, కాని సదుద్దేశంతో చేసిన తప్పిదం ఫలితమే ఈ వివాదం అని ఇద్దరు సీనియర్ అధికారులు చెప్పారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన జమియా మిల్లియా ఇస్లామియా చట్టంలోని 29 (1) నిబంధనను రాష్ట్రపతి కార్యాలయం క్రితం వారం హెచ్ఆర్ డి మంత్రిత్వశాఖకు పంపిన నోట్ లో ఉటంకించింది. 'ఆనరిస్ కాజా' (ఆనరరీ అనే పదానికి లాటిన్ మాట) డిగ్రీలు ప్రదానం చేయాలని జమియా అభిలషించే ప్రముఖ వ్యక్తుల పేర్లను విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫార్సు చేయడానికి ఈ నిబంధన అవకాశం కల్పిస్తున్నది. కాని డిగ్రీలు ప్రదానం చేసే ముందు కౌన్సిల్ సిఫార్సును విజిటర్ అంటే భారత రాష్ట్రపతి ఆమోదించి తీరాలి. కేంద్ర విద్యా సంస్థలన్నీ ఇదే ప్రక్రియను అనుసరించవలసిన అగత్యం ఉంది.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|