దుమ్ములేపుతున్న చాపర్లు!
న్యూఢిల్లీ : ఆటోలు, జీపులు, కార్లు, మినీ బస్సులకు భలే గిరాకీ కాలం ఇది. ఎన్నికల ప్రచారంలో ఈ వాహనాలదే హవా అనుకుంటున్నారా? వీటితో పాటు గంటలో వందల కిలోమీటర్లు అవలీలగా ప్రయాణించగల హెలికాప్టర్లదే అసలు సిసలైన హవా నడుస్తోంది. దేశాన్ని చుట్టి రావడానికి హెలికాప్టర్లు కావాలి మహాప్రభో అని రాజకీయ పార్టీల నాయకులు వెంట పడుతున్నా లేవు పొమ్మంటున్నాయి వాటిని అద్దెకు తిప్పే కంపెనీలు. డిమాండ్ పెరిగిపోవడంతో సొమ్ములు చేసుకునే పనిలో ఆ కంపెనీలు పడ్డాయి. అడ్డా పడ్డా అద్దెలు పెంచేసి అవకాశం ఉన్నప్పుడే పది రాళ్లను వెనుకేసుకోడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
దేశంలో ఎన్నికల జ్వరం పెరిగిపోతుంటే వాటి వేడి హెలికాప్టర్లకు కూడా సోకింది. 2009 ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమై దశల వారీగా సుమారు నెల రోజుల పాటు సాగే ఎన్నికల ప్రక్రియ హెలికాప్టర్ల కంపెనీలకు కాసుల పంటను పండించనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలతో పాటు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల పర్యటనల కోసం హెలికాప్టర్లు ఇవ్వల్సిందిగా కోరుతూ అద్దేకిచ్చే కంపెనీల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి. తమకు కనీసం ఎనిమిదేసి హెలికాప్టర్లు కావాలని కాంగ్రెస్, బిజెపిలు ప్రభుత్వరంగ హెలికాప్టర్ల సంస్థ పవన హంస హెలికాప్టర్స్ (పిహెచ్ హెచ్ ఎల్ )ను కోరాయి.
కాని వారు కోరినన్ని హెలికాప్టర్లను సమకూర్చడం సాధ్యం కాకపోవచ్చని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. కంపెనీ ఆర్డరు పుస్తకం ఇప్పటికే నిండిపోయిందని, రాబోయే కొన్ని నెలల పాటు తమ సంస్థకు చెందిన హెలికాప్టర్లు ఖాళీగా లేవని ఆయన వివరించారు. ఈ రాజకీయ పార్టీల అవసరాలకు అసలు ఎన్ని హెలికాప్టర్లు సమకూర్చగలమో అన్నదానిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. తమ కంపెనీకి 36 హెలికాప్టర్లు ఉన్నాయని, వాటిలో పన్నెండు హెలికాప్టర్లు ఓఎన్ జి సి కి అద్దెకు ఇచ్చేశామని, మిగతావి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చామని ఆయన వివరించారు.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|