టిక్కెట్ లేని ప్రచారం!
న్యూఢిల్లీ: గుర్రానికి ముందు బండి తగిలించినట్లుగానే ఉంది ఢిల్లీలో రాజకీయ పార్టీల వ్యవహారం. రాజధానిలోని ఏడు లోక్ సభ స్థానాలకు తమ తమ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ గాని, భారతీయ జనతా పార్టీ (బిజెపి) గాని ఇంకా ప్రకటించలేదు. కాని ఆశావహులు మాత్రం టిక్కెట్ లేని ప్రయాణం, ప్రచారం అప్పుడే మొదలెట్టేశారు. విఐపి నియోజకవర్గం న్యూఢిల్లీనే ఉదాహరణగా తీసుకుంటే సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపి అజయ్ మాకెన్ ఎన్నికల తేదీలు ప్రకటించడానికి చాలా ముందే అంటే జనవరిలోనే ఎన్నికల 'మూడ్'లోకి వెళ్ళిపోయారు.
'నేను సిట్టింగ్ ఎంపిని. నేను నిర్వర్తించిన కార్యక్రమాల ప్రాతిపదికగా సానుకూల వోటుపై నా ప్రచారాన్ని సాగిస్తున్నాను' అని అజయ్ మాకెన్ వివరించారు. గడచిన ఐదు సంవత్సరాలలో తాను చేసిన పనులు, ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా తాను నిర్వహించిన కార్యక్రమాలు గురించి సవివరంగా తెలియజేస్తూ ఆయన సరోజినీ నగర్, ఆర్.కె. పురం ప్రాంతాలలో పత్రాలు పంచుతున్నారు. బిజెపికి చెందిన విజయ్ గోయెల్, బి.ఎల్. ప్రేమ్ (మాజీ ఎంపిలు), కాంగ్రెస్ కు చెందిన కపిల్ సిబల్, సజ్జన్ కుమార్, సందీప్ దీక్షిత్ (సిట్టింగ్ ఎంపిలు) వంటి ఇతర నాయకులు కూడా తమ ప్రచారాన్ని ప్రారంభించారు.
Pages: 1 -2- News Posted: 8 March, 2009
|