పవార్ 'పవర్'ఫుల్ ఎత్తులు!
ముంబై: కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంకీర్ణాలలోని భాగస్వామ్య పక్షాలు ఆ రెండింటికీ గుడ్ బై చెప్పడం అంతకంతకు ఎక్కువ అవుతుండడంతో అందరి దృష్టి ఇప్పుడు మరాఠా ప్రముఖుడు శరద్ పవార్ పైకి మళ్ళుతున్నది. అందరితో కలుపుగోలుగా వ్యవహరించడానికి పేరు పడిన పవార్ ఎన్నికల అనంతర సినేరియోలో కాబోయే భాగస్వాములుగా 25 రాజకీయ పార్టీల వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.
వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న పవార్ మనుషులంతా కొత్త కొత్త పొత్తులు కుదుర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 'బిజెపి, కాంగ్రెస్ మినహా ప్రతి ఒక్క పార్టీ మాకు మిత్ర పక్షమే' అని పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అగ్ర నాయకుడు ఒకరు చెప్పారు. 'పవార్ సాహెబ్ కు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని పార్టీలలో మిత్రులు ఉన్నారు. అవసరం వస్తే తమ మద్దతు ఇవ్వడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు' అని ఆయన తెలిపారు. ఎన్ సిపి వ్యూహకర్తల మాటలనే విశ్వసించవలసి వస్తే, దేశవ్యాప్తంగా 25 పైచిలుకు పార్టీలపై పవార్ భరోసా పెట్టుకుంటున్నారనాలి.
స్వరాష్ట్రం మహారాష్ట్రలో పవార్ శివసేనను నమ్ముకోవచ్చు. 14వ లోక్ సభలో శివసేనకు 12 మంది ఎంపిలు ఉన్నారు. పవార్ సొంత పార్టీ గత ఎన్నికలలో 9 సీట్లను గెలుచుకున్నది. ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పిఐ) (రామదాస్ అతావలె వర్గం)కు ప్రస్తుత లోక్ సభలో ఒక ఎంపి ఉన్నారు. ఆ ఎంపి సాక్షాత్తు అతావలేయే. అతావలె అన్నిటికీ పవార్ పైనే అధారపడుతుంటారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన మద్దతు ఉంటుందని ఎన్ సిపి ధీమాగా ఉండవచ్చు.
Pages: 1 -2- News Posted: 10 March, 2009
|