ముంబైకి 'స్లమ్' టూరిస్టులు
బెంగళూరు: సామాజిక పరిస్థితుల ప్రతిఫలనంగా సినిమాలు పుట్టుకొస్తే, అలా రూపొందిన సినిమాల ప్రభావం తిరిగి సమాజంపై పడటం సహజం. ఒకప్పుడు 'కాశ్మీర్ కి కలి' చిత్రంలో షమ్మీకపూర్, షర్మిలా టాగోర్ ల ప్రేమ కథ దేశంపై తీవ్ర ప్రభావమేసింది. దాంతో కాశ్మీర్ హనీమూన్ గమ్యంగా మారింది. కాశ్మీర్ టూరిజం మరింతగా పెరిగింది. చిత్రాలకు టూరిజానికి గల అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. ఎనిమిది ఆస్కార్ అవార్డుల గెలుచుకున్న 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్ర కథాంశంలోని కేంద్ర బిందువు ముంబై నగరం నేడు టూరిస్టుల హాట్ స్పాట్ గా అవతరించింది. 26\11 ఉగ్రవాదుల దాడితో కోల్పోయిన టూరిజం ప్రతిష్ట మళ్లీ ముంబై నగరానికి వచ్చింది. అయిదుగురి కంటే ఎక్కువ మంది విదేశీ ప్రయాణీకులు ముంబై సందర్శించేందుకు వివరాలను అడుగుతున్నారని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ తెలియజేసింది.
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన 10 పర్యాటక కేంద్రాల్లో ముంబై అగ్రస్థానంలో నిలవగా, రెండవ స్థానంలో జపాన్ నిలిచిందని ప్రముఖ ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీ ఎక్స్ పీడియా తెలిపింది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ద్వారా ముంబై, 'మెమొయిర్స్ ఆఫ్ గైషా' చిత్రం ద్వారా జపాన్ పర్యాటక కేంద్రాలుగా అవతరించాయి. 2004లో వచ్చిన 'ది మోటార్ సైకిల్ డైరీస్' చిత్రంతో దక్షిణ అమెరికా, 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' చిత్రంతో న్యూజిల్యాండ్, 'బ్రేవ్ హార్ట్' చిత్రంతో స్కాట్ ల్యాండ్, 'బ్రామ్ స్టాకర్స్ డ్రాక్యులా' చిత్రంతో రుమానియా, 'థెల్మా అండ్ లూయిస్' చిత్రంతో అమెరికా, 'ఏ రూమ్ విత్ ఏ వ్యూ' చిత్రంతో ఫ్లోరెన్స్, 'ఔట్ ఆఫ్ ఆఫ్రికా' చిత్రంతో కీన్యా, 'ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్' చిత్రంతో సల్జ్ బర్గ్ ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారాయి.
Pages: 1 -2- News Posted: 11 March, 2009
|