అటల్ బ్రాండే అద్వానీకి దిక్కు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి రాజకీయాల నుంచి రిటైరై ఉండవచ్చు. కాని రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రచారానికి ఆయనే ప్రధానాస్త్రం కానున్నారు. ఆయనను ఆకర్షణ శక్తిని, సర్వజనామోద యోగ్యతను ఆధారం చేసుకుని పార్టీ ఎన్నికల వ్యూహకర్తలు విస్తృతమైన ప్రణాళికను రూపొందించారు. మూడు మాధ్యమాలు - ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎఫ్ఎం రేడియోలలో పార్టీ తలపెట్టిన ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాన మంత్రి ఫోటోలను ప్రదర్శించడమే కాకుండా పార్టీ సందేశాలను అందరికీ అందజేసేందుకు కీలక అంశాలపై ఆయన ప్రసంగాల భాగాలను కూడా వినిపిస్తారు. టివి, రేడియో ఎఫ్ఎం చానెల్స్ లో పార్టీ తలపెట్టిన ప్రచారంలో అవి ప్రధాన పాత్ర పోషించవచ్చు.
ముఖ్యమైన అంశాలపై వాజపేయి సందేశాలు పార్టీ సంకల్పించిన ప్రచార కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటాయి. 'అవి వోట్ల కోసం విజ్ఞప్తి రూపంలో ఉండవు. కాని ఐదు సంవత్సరాల యుపిఎ పాలనలో దేశాన్ని వెనుకకు నెట్టిన రంగాల గురించి ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం వాటిని ఉపయోగించనున్నాం' అని బిజెపి అధికార ప్రతినిధి సిద్ధార్థ నాథ్ సింగ్ తెలియజేశారు.
పార్టీ మార్చి 16న దేశ వ్యాప్తంగా ఉధృత స్థాయిలో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. 'మజ్బూత్ నేత, నిర్ణాయక్ సర్కార్' (బలమైన నాయకుడు, నిర్ణాయక ప్రభుత్వం) అనేది పార్టీకి మౌలిక ప్రచార నినాదం అవుతుంది. విజువల్ మీడియా ప్రధానమైన మాధ్యమంగా కొనసాగుతూనే ఉంటుంది. కాని ఈసారి దృష్టి ప్రాంతీయ టివి చానెల్స్ పైనే కేంద్రీకృతమవుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలతో ఈ ప్రచారం సాగుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు, 1989 నుంచి జరుగుతున్న ఎన్నికల వలెనే రాష్ట్ర ఎన్నికల సమాహారంగా మారిపోయినవని పార్టీ నాయకత్వం భావనకు తగినట్లుగానే ఈ ప్రచారం సాగుతుంది.
Pages: 1 -2- News Posted: 12 March, 2009
|