నోరు విప్పని యువ నేతలు!
న్యూఢిల్లీ: అధికార రంగస్థలిని అధిరోహించిన అనేక మంది యువ పార్లమెంటేరియన్లు ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. వారు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని 14వ లోక్ సభలో పార్లమెంటేరియన్లకు సంబంధించిన విధాన పరిశోధన కేంద్రం (సిపిఆర్) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాహుల్ గాంధీ హాజరు సగటుకు కొద్గిగా ఎక్కువ (63 శాతం) మాత్రమే. కాని కాంగ్రెస్ అధ్యక్షురాలి వారసుడు ఐదు చర్చలలో మాత్రమే పాల్గొన్నారు. ఆయన కేవలం మూడు ప్రశ్నలు అడిగారు. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా కూడా తన ప్రభావం ఏమాత్రం చూపలేకపోయారు. ఆయన కేవలం ఆరు చర్చలలో పాల్గొన్నారు. అసలేమీ ప్రశ్నలు అడగలేదు.
యువ ఎంపిలలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సభ్యుడు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి చెందిన దుశ్యంత్ సింగ్. వసుంధరా రాజె కుమారుడు, రాజస్థాన్ లోని ఝలావర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నదుశ్యంత్ సింగ్ 604 ప్రశ్నలు అడిగారు. ఈ విషయంలో యువ పార్లమెంటేరియన్లు అందరిలోకి ఆయనదే అగ్ర తాంబూలం. ఆయన 46 సార్లు చర్చలలో పాల్గొన్నారు. 63 శాతం హాజరుతో ఆయన మిగిలినవారందరినీ వెనుకకు నెట్టేశారు. మరొక వైపు బిజెపికే చెందిన మానవేంద్ర సింగ్ పని తీరు మాత్రం పేలవంగా ఉంది. బిజెపి సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ కుమారుడైన మానవేంద్ర సింగ్ 15 చర్చలలో పాల్గొన్నారు కాని ఒక్క ప్రశ్నను కూడా అడగలేదు. అయితే, ఆయన 75 శాతం హాజరును నమోదు చేశారు.
కాంగ్రెస్ పక్షంలో కూడా చురుకైన పార్లమెంటేరియన్లు కొందరు లేకపోలేదు. వారిలో చెప్పుకోదగినవారు కురుక్షేత్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్ జిందాల్, ముంబై సౌత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిలింద్ దేవరా. ఐదు సంవత్సరాలలో జిందాల్ 376 ప్రశ్నలు అడగగా మిలింద్ దేవరా 472 ప్రశ్నలు అడిగారు. ఇక జిందాల్ 35 చర్చలలోను, దేవరా 10 చర్చలలోను పాల్గొన్నారు. ఆ ఎంపిలు ఇద్దరూ 70 శాతంపైగా హాజరు నమోదు చేశారు.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|