ద్రవ్యోల్బణం ఫలాలెవరికి?
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం తాజాగా 2.46 శాతానికి దిగిపోయింది. గత ఆగష్టులో 13 శాతానికి చేరి హడలెత్తించిన ద్రవ్యోల్బణం ఈ ఫిబ్రవరి నాటికి అనూహ్యం చాలా ఉపశమనాన్ని కలిగించింది. అయితే, సామాన్య ప్రజానీకం లేదా వేతనపరులు గత ఏడాది ఆగష్టులో ఖర్చు చేసిన సరకులు ప్రస్తుతం తక్కువగా చెల్లిస్తున్నట్లా? అదెంతమాత్రమూ సరైనదికాదు. నెలసరి మనం పెడుతున్న ఖర్చులు టోకు ధరలు కాదు. టోకు ధరల సూచిక మాత్రమే ద్రవ్యోల్బణాన్ని సూచిస్తుంది. ఉప్పు, పప్పు లాంటి ఫలసరకులు, సబ్బులు, షాంపూలు, ఆహార పదార్ధాల కొనుగోలుకు గాను మనం మన దగ్గరున్న పచారీ కొట్టు యజమానికి మాత్రమే చెల్లిస్తున్నాము. మనం చేస్తున్న ఖర్చులు వినియోగదారుని ధరల కిందకు వస్తాయి. ఈ ఖర్చులన్ని వినియోగదారుని ధరల సూచీ కిందకు వస్తాయి.
ద్రవ్యోల్బణం కిందికి దిగజారుతున్న కొద్దీ వినియోగదారుని సూచిక ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాము. గత ఏడాది ఆగష్టు నుండి ఈ ఏడాది ఫిబ్రవరి దాకా గడచిన కాలంలో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణాన్ని, వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణాన్ని మనం పరిశీలిస్తే ప్రభుత్వాధికారులు వినియోగదారుల ధరల సూచికను అసలు పట్టించుకోనేలేదన్న విషయం అర్ధమవుతుంది. గత ఆగష్టులో టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 13 శాతంగా ఉన్న సమయంలో వినియోగదారుల ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 10.45 శాతంగా ఉండింది. ఫిబ్రవరి నాటికి టోకు ధరల ద్రవ్యోల్బణం 2.46 శాతానికి దిగితే, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం 9.70 శాతానికి తగ్గింది. ఆగష్టు నాటి ద్రవ్యోల్బణంతో ఈ తగ్గుదల నామమాత్రమే.
వస్తువుల ధరలు పెరిగినంత వేగంగా వాటిని తయారు చేసేందుకు వినియోగించే ముడిసరుకుల ధరలు పెరగవు. తయారీ దారులు, మధ్యవర్తులు ఈ ద్రవ్యోల్బణం తగ్గడంతో లాభాలను మూటగట్టుకుంటున్నారు. వినియోగదారులకు ద్రవ్యోల్బణం తగ్గుదలతో పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది. సఫాల్, రిలయన్స్ ఫ్రెష్, ఫుడ్ బజార్, స్పెన్సర్స్ రిటైల్ చైన్ లలోని వినియోగదారుల ధరలపై ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ సర్వే జరిపింది. గత ఏడాది ఆగష్టులో ఉల్లిపాయల ధర కంటే ప్రస్తుతం 10 శాతం అధికంగానే ఉంది. రిఫైన్డ్ వంటనూనె ధర ఫుడ్ బజార్ 25 శాతం తగ్గించింది. అయితే మిగిలిన రిటైల్ చైన్లలో వంటనూనె ధర 12 శాతం అధికంగా ఉందని ఆ సర్వే తెలిపింది.
Pages: 1 -2- News Posted: 13 March, 2009
|