బాబు మంత్రాలు-తంత్రాలు
ఆయాచితంగా లభించిన ఈ అపూర్వ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని మరికొన్ని ప్రయోగాలు చేయడానికి చంద్రబాబు సిద్ధం అయిపోయారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మాన్ని ఇచ్చినందుకు ప్రతిగా ఉభయ కమ్యూనిస్టులకు కలిపి నాలుగు లోక్ సభ స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు ప్రతిపాదించారు. ఇద్దరు మిత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత జనరల్ కేటగిరీలోని నల్గొండ, భువనగిరి, గిరిజన కోటాలో రిజర్వు అయి, కొత్తగా ఆవిర్భవించిన అరకు, మహబూబాబాద్ లోక్ సభ స్థానాలను చంద్రబాబు కమ్యూనిస్టు మిత్రుల ముందు ఉంచారు. ఉభయులూ ఒక జనరలు, ఒక రిజర్వు స్థానాలను తీసుకోవాలని సిపిఐకు, సిపిఎంకు ఆయన సూచించారు. ఈ ప్రతిపాదన బావుందని సూత్రప్రాయంగా అంగీకరించిన ఉభయ కమ్యూనిస్టులు కొంచెం ఆలోచించుకుని చెబుతామని చిన్న సన్నాయి నొక్కు నొక్కారని అంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే వామపక్ష మిత్రులు ఈ నాలిగింటితో పాటు అనంతపురం, విజయవాడ లోక్ సభ స్థానాలు కూడా తమకు ఇవ్వాలని కోరారట. అయితే తెలుగుదేశంపార్టీలోని అంతరంగీక వర్గాలు మాత్రం కమ్యూనిస్టులకు అంత సీన్ చంద్రబాబు ఇవ్వరని, ఆ నాల్గింటితోనే కమ్యూనిస్టులు సరిపెట్టుకునేలా చంద్రబాబు సర్ధిచెబుతారని అంటున్నాయి.
బిసి మంత్రం- బాబు తంత్రం
మిత్ర పక్షాలలోని బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో రాజకీయ మేధావిగా చంద్రబాబు రచ్చ గెలిచినా తెలుగుదేశంపార్టీలోని అంతర్గత కుమ్ములాటను పరిష్కరించడంలో కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నరని విశ్వసనీయవర్గాల భోగట్టా. ఇంట గెలవడం ఈ అపర చాణక్యునికి కత్తి మీద సామేనని చెబుతున్నారు. కోస్తాలోని లోక్ సభ స్థానాలలో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు. తద్వారా అసెంబ్లీ స్థానాలలో ప్రయోజనం పొందాలన్నది ఆయన ఎత్తుగడలో భాగమని వివరిస్తున్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో సామాజిక న్యాయం సూత్రాన్ని పాటించడం ద్వారా కోస్తాలో ప్రజారాజ్యం ప్రభావాన్ని, రాయలసీమలో కాంగ్రెస్ ఆధిక్యాన్ని గండి కొట్టవచ్చని చంద్రబాబు అంచనా. కాని పార్టీలో సీనియర్ల నుంచి వస్తున్న అపారమైన వత్తిడి చంద్రబాబును ఊపిరితీసుకోనీయడం లేదు.
Pages: -1- 2 -3- News Posted: 13 March, 2009
|