బాబాయి కంటె అబ్బాయే బెటర్!
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై తెలుగుదేశంతో పాటు మహాకూటమి మిత్రపక్షాలు కూడా ఆశలు పెంచుకుంటున్నాయి. రాయలసీమలో బాలకృష్ణ పర్యటించినప్పుడు ఆనందించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం పార్టీకి ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణలో పర్యటిస్తే తాము స్వాగతం పలుకుతామని, ఆయన ప్రచారం మహాకూటమి విజయానికి దోహదపడుతుందని టిఆరెస్ నాయకుడు తారక రామారావు అన్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలు దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనే పోటీ చేస్తున్నందున జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పర్యటిస్తే అన్ని పార్టీలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ శ్రీకాకుళం నుంచి ప్రచారం ప్రారంభించగానే తెలుగుదేశం శ్రేణులు తమ దృష్టిని ఆయనవైపు మళ్లించాయి. బాలకృష్ణ ప్రచారంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని పోలుస్తూ పార్టీలో చర్చలు ప్రారంభమయ్యాయి. 'జూనియర్ ఎన్టీఆర్ సంక్షిప్తంగా, సూటిగా మాట్లాడుతున్నారు. చెప్పదలచుకున్నది మనసుకు హత్తుకునేలా చెబుతున్నారు. అదే బాలకృష్ణ అయితే మాటల కోసం తడుముకుంటున్నారు. అది జనాన్ని ఆకర్షించడం లేదు' అని కోస్తా ప్రాంతానికి చెందిన తెలుగుదేశం మాజీ మంత్రి విలేఖరులతో అన్నారు.
Pages: 1 -2- News Posted: 14 March, 2009
|