ఖమ్మం వదలని బాబు
హైదరాబాద్: వామపక్షాలు ఆశిస్తున్న ఖమ్మం లోక్ సభ నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్ధిని నిలబెట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఖమ్మం సీటు తమకు కేటాయించకపోతే మహాకూటమి నుంచి తప్పుకుంటామని సిపిఐ ఖమ్మం జిల్లా శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని సవాలుగా తీసుకున్న చంద్రబాబు తనదైన శైలిలో వ్యూహ రచన సాగిస్తున్నారు. సిపిఐ అగ్రనాయకుడు ఎబి బర్దన్ తో బెంగుళూరులో, మరో నాయకుడు రాజాతో ఢిల్లీలో ఆయన చర్చలు జరిపి, ఖమ్మం, నల్గొండ సీట్లకు సంబంధిచి ఒక అవగాహనకు వచ్చారని తెలిసింది. ఈ రెండు స్థానాలలో తెలుగుదేశం పోటీ చేయడానికి సిపిఐ అగ్ర నాయకులిద్దరూ అంగీకరించారని, ఇంకా తుది నిర్ణయం ఇంకా వెలువడవలసి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నల్గొండ జిల్లా నాయకులతో కూడా తన నివాసంలో సమావేశమైన చంద్రబాబు ఇందుకు సంబంధించి వారికి పరోక్ష సంకేతాలు కూడా ఇచ్చారని తెలిసింది.
ఖమ్మం లోక్ సభ సీటును సిపిఐకి ఇవ్వకపోతే మహాకూటమి నుంచి వైదొలగుతామని ఆ పార్టీ జిల్లా నాయకులు చెప్పిన మాట చంద్రబాబుకు నచ్చలేదు. పార్టీలో సమస్యలుంటే అగ్ర నాయకులకు వివరించి వాటిని పరిష్కరించుకోవాలి గాని పత్రికలకెక్కి హెచ్చరించడం సమంజసం కాదని, అటువంటి హెచ్చరికలను తాను ఖాతరుచేయనని ఆయన స్పష్టం చేశారట. ఖమ్మంతో పాటు నల్గొండలో ఏ మాత్రం బలం లేని సిపిఐ అక్కడి నుండి పోటీచేసి ఎలా విజయం సాధిస్తుందని ఆయల ప్రశ్నించారని తెలిసింది. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాలు కోరడం బాధాకరంగా ఉందని, భువనగిరి విషయమై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినప్పుడు, మరో సీటు కోసం ఎలా పోటీ పడతారని ఆయన ప్రశ్నించారు.
Pages: 1 -2- News Posted: 17 March, 2009
|