విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలు సునామీని సృష్టిస్తున్నాయి. మారుమూల గ్రామలు మొదలుకుని పట్టణాల వరకు ఎన్టీఆర్ రోడ్ షోను చూసి ఆయన ప్రసంగాలను వినేందుకు జనం విరగబడిపోతున్నారు. గుంటూరులో జరిగిన యవ గర్జన సభ ద్వారా నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తీసుకువస్తే జూనియర్ ఎన్టీఆర్ మరో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఈ స్పందనను తెలుగుదేశం పార్టీ ఏమేరకు ఓట్ల కింద మలుచుకుంటుందో తెలియదు కాని ఎన్టీఆర్ పర్యటనతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది.
పిల్లకాకి అంటూ ఎన్టీఆర్ ను కాంగ్రెస్ నాయకులు తేలిగ్గా కొట్టివేసినప్పటికీ ఆయన సభలకు వెల్లువెత్తుతున్న జనాన్ని చూసి వారి గుండెల్లో రైళ్ళు పరుగులెడుతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలిసారిగా 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పాగా వేసింది. అప్పటి నుంచి ఈ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి కోలుకోకుండా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించి ఆ పార్టీ అధినేత చిరంజీవి ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించినపుడు కూడా ఆయనకు ప్రజల నుంచి లభించిన అపూర్వ ఆదరణతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తోడు కావడంతో ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడని పరిస్థితి ఎదురైంది.
మొత్తం మీద చాలా కాలంపాటు దాచిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ సంధించిన 'ఎన్టీఆర్' అనే బ్రహ్మాస్త్రం లక్ష్యాన్ని పూర్తిగా ఛేదిస్తోంది. ఆ పార్టీ యంగ్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఆనవాయితీ తప్పకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ ద్వారమైన శ్రీకాకుళం నుంచి పర్యటనను ప్రారంభించినది లగాయితూ జనం నుంచి జేజేలు అందుకుంటున్నారు. తలలు పండిన రాజకీయ నాయకులు సైతం జూనియర్ ప్రసంగాలకు ముగ్దులవుతున్నారు. ఇంతవరకూ స్టార్ పొలిటీషియన్లు మొదలుకుని, రాజకీయాల్లో అడుగుపెట్టిన స్టార్లు వరకూ అంతా ప్రసంగాలలో తడబడ్డవారే కావడం విశేషం. వారు చెబుతున్నది జనానికి ఎంతవరకూ బోధ పడుతున్నదో తెలియని పరిస్థితి.