లాలూపై కాంగ్రెస్ రుసరుస!
న్యూఢిల్లీ: బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ జరిపిన 'మినీ తిరుగుబాటు' కాంగ్రెస్ కు ఆగ్రహాన్ని తెప్పించడమే కాకుండా సంకీర్ణాల పట్ల సాధారణంగా గల అపనమ్మకాన్ని, వ్యతిరేకతను తిరిగి రేకెత్తించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి ఇష్టమైన మిత్ర పక్షాల నేతలలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) అధ్యక్షుడు అగ్ర స్థానంలో ఉన్నందున ఈ పరిణామం కాంగ్రెస్ కు మరింత ఇబ్బందికరంగా తయారైంది. ఆమె 'విదేశీ' జాతీయత పట్ల కాంగ్రెస్ నాయకులలో చాలా మంది ఆత్మరక్షణాత్మక వైఖరిని అనుసరించగా, కొందరైతే పశ్చాత్తప్తులు కాగా, లాలూ ఒక్కడే బిజెపి ప్రచారానికి వ్యతిరేకంగా ఆమెకు బాసటగా నిలచి ఆమెను 'దేశానికి కోడలు'గా పేర్కొన్నారు.
అధికారిక ఔచిత్యాన్ని మధ్యమధ్యలో తప్పుతున్నందుకు డిఎంకెను, తమిళనాడులోని ఇతర మిత్ర పక్షాలను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విడిగా మందలించారని, కాని లాలూ ఇంతవరకు అటువంటి ఫిర్యాదుకు ఆస్కారమే కలిగించలేదని ప్రధాని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందువల్ల, రైల్వే మంత్రి లాలూ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ బీహార్ లో కాంగ్రెస్ కు మూడంటే మూడు సీట్లను (2004లో కన్నా ఒకటి తక్కువ) వదలి తాము పోటీ చేసే సీట్ల సంఖ్యను ఏకపక్షంగా ప్రకటించినప్పుడు సోనియా గాంధి, ఆమె రాజకీయ అనుచరులు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. ఆతరువాత మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షురాలితో సమావేశానికి సమయాన్ని లాలూ కోరినప్పుడు ఆయనకు తిరస్కృతే ఎదురైంది.
పాశ్వాన్ ను కూడా సోనియా బాగానే గౌరవించారు. సోనియా నివాసం 10 జనపథ్ కు పక్కనే పాశ్వాన్ నివాసం. అందువల్ల సోనియా, పాశ్వాన్ ఇరుగు పొరుగు అయ్యారు. సోనియా గాంధీ తన భద్రతా ఆంక్షలను కూడా కాదని మార్నింగ్ వాక్ సందర్భంగా పొరుగునే ఉన్న పాశ్వాన్ నివాసానికి వెళుతుండేవారని వినికిడి. గుజరాత్ హింసాకాండ పట్ల నిరసన సూచకంగా పాశ్వాన్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) నుంచి నిష్క్రమించిన కొద్ది రోజులకే ఒక శీతాకాలం ఉదయం సోనియా గాంధీ మార్నింగ్ వాక్ చేస్తూ పొరుగునే ఉన్న పాశ్వాన్ నివాసంలోకి వెళ్ళారు. ఆ సందర్భంగా సోనియాతో కలసి పాశ్వాన్ దిగిన ఫోటోఒకటి ఇప్పటికీ పాశ్వాన్ లివింగ్ రూమ్ లో ప్రముఖంగా కనిపిస్తుంటుంది.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|