ఈ గాంధీకి తొందరెక్కువ!
న్యూడిల్లీ: ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ లో ఫిరోజ్ వరుణ్ గాంధీ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించివుండొచ్చు. అయితే ఆయన గురించి తెలిసిన వారికి అవి ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించవు. కొన్నేళ్ళ క్రితం నవయవ్వనంలో ఉండి, ఆకర్షణీయంగా కనిపిస్తున్న వరుణ్ గాంధీ నాగపూర్ కు వెళ్ళారు. అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అగ్ర నాయకుల దగ్గర వరుణ్ కొద్దికాలం శిష్యరికం చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యానంతరం భారత దేశ చరిత్ర గురించి అక్కడ పొందిన జ్ఞానం యువకుడైన వరుణ్ గాంధీకి దిగ్భ్రాంతి కలిగించింది.
సరిగ్గా అంతకుముందే భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరిన వరుణ్ కు తరువాత కొన్ని రోజుల పాటు సరిగ్గా నిద్ర పట్టనట్లు తెలుస్తున్నది. తన ముత్తాత గురించి, ఆకాలపు రాజకీయాల గురించి తనకు వారు చెప్పిన వాస్తవాలను ఆయన జీర్ణించుకోలేకపోయారు. నాగపూర్ పర్యటనకు ముందు వరుణ్ తన మూలాలు కనుగొనే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు. సంజయ్ గాంధీ శకానికి చెందిన కాంగ్రెస్ నాయకుల ఇళ్ళకు ఆయన పలుసార్లు వెళ్ళారు. కాని ఆ అనుభవం ఆయనకేమీ ఉపకరించేదిగా కనిపించలేదు. ఎందుకంటే ఆయన కలుసుకున్న నాయకులు మర్యాదగా మసలుకొనేవారే గాని గుంభనంగా ఉంటుండేవారు. ఇందిరా గాంధీతోను, సోనియా గాంధీతోను ఆయన తల్లి మేనకకు 'అంతంత మాత్రంగా గల సంబంధాలు' చాలా మందిని సంజయ్ కల, ఆలోచనల గురించి వరుణ్ కు విశదంగా చెప్పేందుకు వెనుకాడేట్లు చేశాయి.
వరుణ్ కు ఆప్యాయంగా స్వాగతం చెప్పిన, కాస్త పేరు, అనుభవం ఉన్న ఏకైక కాంగ్రెస్ నాయకుడు సీతారామ్ కేసరి. పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయి, భ్రమలు వీడిన కేసరికి వరుణ్ లో తనను అవమానకరంగా బయటకు గెంటిన నాయకులను సవాల్ చేయగల వ్యక్తి కనిపించారు. అయితే, పురానా ఖిల్లా రోడ్ లోని కేసరి నివాసానికి వరుణ్ క్రమం తప్పకుండా వెళ్ళే లోపలో ఆయన బాత్ రూమ్ లో కాలు జారి పడి ఆ తరువాత మరణించారు. 2004 మార్చిలో రాహుల్ రాజకీయ రంగప్రవేశం, బిజెపిలో వరుణ్ చేరిక ఒకేసారి జరిగాయి. అన్నదమ్ముల పిల్లలైన ఆ ఇద్దరూ తమను ప్రత్యర్థులుగా చెప్పుకోకపోయినా వారి పరస్పర విరుద్ధమైన స్వభావాలు రాజకీయ చట్రానికి ఒకరిని ఇటూ, మరొకరిని అటూ చేశాయి.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|