వోట్ల కోసం కొత్త పోకడ!
కోలకతా: లోకల్ రైలులో ప్రయాణికులతో పిచ్చాపాటి మాట్లాడడం, చేపలు పట్టడం, పిల్లలతో ఫుట్ బాల్ ఆడడం లేదా సొంత కవితలను గోడలపై రాయడం వంటి కొత్త మార్గాలను పశ్చిమ బెంగాల్ లో లోక్ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కొసం ఎంచుకున్నారు. జాదవ్ పూర్ లో సిపిఎం సిట్టింగ్ ఎంపి సుజన్ చక్రవర్తి తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఒక రోజు ఒక రైలు బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులతో పిచ్చాపాటీ మాట్లాడినా వోట్లు అడగకపోవడం చూసి అనేక మంది ఆశ్చర్యచకితులయ్యారు.
'నేను వోట్ల కోసం ప్రాథేయపడాలని అనుకోలేదు. నేను జనానికి సన్నిహితం కాగలిగితే వోట్లు వాటంతట అవే వస్తాయి' అని సుజన్ చక్రవర్తి చెప్పారు. ఆయన తన నియోజకవర్గంలో కొంత మంది పిల్లలతో కలసి ఫుట్ బాల్ కూడా ఆడారు. సిపిఎం వృద్ధ నేత జ్యోతి బసు ఇటీవల ప్రారంభించిన ఆ ఎంపి వెబ్ సైట్ 'లో ఆయన గురించిన మొత్తం వివరాలు ఉన్నాయి. ఆయన జీవిత చరిత్ర, నియోజకవర్గం, విజయాలు, కార్యకలాపాల గురించిన సమాచారం అంతా అందులో ఉంది. ఏవైనా ప్రశ్నలు అడగవలసిందిగా కూడా జనాన్ని ఆ వెబ్ సైట్ కోరుతున్నది.
'జనం నన్ను ఏ ప్రశ్ననైనా అడగవచ్చు. నేను 24 గంటలలోగా సమాధానం ఇస్తాను. నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరినీ కలుసుకోలేకపోవచ్చు. కాని నా వెబ్ సైట్ ద్వారా అందరితో నేను మాట్లాడగలను' అని సుజన్ చక్రవర్తి తెలిపారు. సుజన్ చక్రవర్తి ప్రత్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ (టిసి) అభ్యర్థి, గాయకుడు, కవి కబీర్ సుమన్ కూడా ఏమీ వెనుకబడిలేరు. సుజన్ చక్రవర్తి గోడలపై సొంత గీతాలు రాస్తున్నారు. వాటిని పాడుతున్నారు. అయితే, హుందాతనం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నకబీర్ సుమన్ తన ప్రత్యర్థి గురించి మంచి మాటలే చెప్పారు. 'ఆయన పార్లమెంట్ సభ్యుడు. నేనా కొత్తవాడిని. అయితే, ఈ నియోజకవర్గంలో ఇంకా చాలా పనులు జరగవలసి ఉన్నాయని నేను చెప్పక తప్పదు' అని అన్నారు.
Pages: 1 -2- News Posted: 19 March, 2009
|