డామిట్, డిపాజిట్!
న్యూఢిల్లీ: ఇండిపెండెంట్ అభ్యర్ధులు గందరగోళం సృష్టించడమే తప్ప ఎన్నికల్లో గెలుపొందేది దాదాపు శూన్యమేనన్న వాదానికి సమతూకంగా, ఈ రోజుల్లో రాజకీయ పార్టీల అభ్యర్ధులలో అధికశాతం ఆశించిన ఫలితాలు సాధించలేక పోతున్నారు. గెలుపొందడం మాట అటుంచితే, 2004 ఎన్నికల్లో కనీసం డిపాజిట్టు కూడా దక్కించుకోలేని వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఎన్నికల కమిషన్ అంచనా ప్రకారం, మొత్తం 5,435 మంది అభ్యర్ధులు బరిలోకి దిగితే, వారిలో 77 శాతం డిపాజిట్లు కోల్పోయారు! వీరిలో ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువే అయినా, జాతీయ, రాష్ట్రస్థాయి పార్టీల అభ్యర్ధులేమీ వారికి తీసిపోలేదు.
రాజకీయ పార్టీల టిక్కెట్లపై పోటీ చేసిన అభ్యర్ధుల్లో 1,351 మంది ఆరు జాతీయస్థాయి పార్టీలకు చెందినవారు కాగా, 801 మంది రాష్ట్రస్థాయి పార్టీలకు, 898 మంది గుర్తింపు లేని పార్టీలకు చెందినవారు. అంటే మొత్తం 3,050 మంది వివిధ పార్టీల గుర్తులపై పోటీ చేయగా, 2,370 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. అలాగే 2,385 మంది ఇండిపెండెంట్లలో 15 మంది మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు. ఎన్నికల కమిషన్ గణాంకాలు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆరు జాతీయస్థాయి పార్టీలు - బిజెపి, బిఎస్పీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎన్ సిపి నిలబెట్టిన అభ్యర్ధుల్లో 40 శాతం డిపాజిట్లు కోల్పోయారు. అలాగే 36 రాష్ట్రస్థాయి పార్టీలకు చెందిన అభ్యర్ధుల్లో 55 శాతం, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్ధుల్లో 96.5 శాతం, ఇండిపెండెంట్లలో దాదాపు 99.37 శాతం డిపాజిట్లు కోల్పోయారు.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|