రాజీ పడని రాజ్ నాధ్!
న్యూఢిల్లీ: తనను అవమానించారని బాధతో అలకపాన్పు ఎక్కిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి గురువారం ఉదయం పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరు కావడంతో వారిద్దరి మధ్య రాజీ కుదిరిపోయిందని అనుకున్నారు. అయితే ఆ నాయకులిద్దరూ ఈ సమావేశంలో మళ్ళీ ఘర్షణ పడ్డారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఢిల్లీ, బీహార్ లలో కొన్ని సీట్లకు పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన ఈ సమావేశానికి జైట్లీ హాజరు కావడాన్ని 'విభేదాలు తగ్గడానికి సూచిక'గా పార్టీ అధికార ప్రతినిధి బల్బీర్ పుంజ్ అభివర్ణించారు. అయితే, దర్భాంగా స్థానానికి పార్టీ అభ్యర్థి ఎంపికపై అరుణ్ జైట్లీ సూచనను రాజనాథ్ తోసిపుచ్చిన తరువాత వారిద్దరి మధ్య విభేదాలు మరింత తీవ్రమై ఉండవచ్చునని ఇతరులు సూచించారు.
ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు రెండింటికీ ఇన్ చార్జి అయిన జైట్లీ దర్భాంగా స్థానానికి సంజయ్ ఝాను నిలబెట్టాలని గట్టిగా కోరారు. కాని రాజనాథ్ కరాఖండిగా కాదని, మాజీ క్రికెటర్ కీర్తి అజాద్ పేరును ఆమోదించారు. సంజయ్ ఝా బీహార్ శాసన మండలిలో వివాదాస్పద సభ్యుడు. ఝా మరొక సుధాంశు మిట్టల్ కాగల అవకాశాలు ఉన్నాయని పార్టీలో పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. అసోంలో పార్టీ వ్యవహారాల తోటి ఇన్ చార్జిగా వాణిజ్యవేత్త సుధాంశు మిట్టల్ ను నియమించడం జైట్లీకి మింగుడ పడని విషయం విదితమే.
కేంద్ర ఎన్నికల కమిటీ రెండు రోజుల క్రితం బీహార్ కోసం అభ్యర్థుల పేర్లపై చర్చించినప్పుడు సంజయ్ ఝా పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు అగ్రశ్రేణి నాయకులు తీవ్రంగా స్పందించారు. ఝాను 'బిజెపిలో నితీశ్ కుమార్ మనిషి'గా కమిటీ సభ్యులు అభివర్ణించడంతో ఎల్.కె. అద్వానీ, రాజనాథ్ ఆ స్థానం సంగతి తరువాత తేల్చవచ్చునని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మిట్టల్ నియామకానికి నిరసనగా జైట్లీ ఆ రెండు రోజులు సమావేశాలను బహిష్కరించారు.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|