రాజీ పడని రాజ్ నాధ్!
కీర్తి అజాద్ తన పేరు చెడగొట్టుకున్నారని, ఝా 'గెలిచే అవకాశం ఉన్న' అభ్యర్థి అని జైట్లీ అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాని కమిటీలో మెజారిటీ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాజనాథ్ ఆ స్థానానికి ఝా అభ్యర్థిత్వాన్ని ఆమోదించ నిరాకరించారు.ఝా అభ్యర్థిత్వాన్ని జైట్లీ సమర్థించడం బిజెపి వర్గాలలో చర్చనీయమైంది. 'అధికార బ్రోకర్'గా తాను పేర్కొన్న మిట్టల్ పట్ల తాను అనుసరించిన నైతిక వైఖరికి ఇది పూర్తి భిన్నంగా ఉందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. కాగా, మిట్టల్ తన బాధ్యతల నిర్వహణకు పూనుకుని గౌహతిలో ఒక ఎన్నికల ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేశారు.
ఇది ఇలా ఉండగా, రాజనాథ్ నివాసానికి జైట్లీ వెళ్ళడంపై వేరే అర్థాలు వెతకరాదని జైట్లీ అనుచరులు అంటున్నారు. జైట్లీ పార్టీ అధ్యక్షునితో వ్యక్తిగత పోరు సాగించడం లేదని వారు వాదించారు. 'ఆయన సూత్రబద్ధమైన వైఖరి అనుసరించారు. దానినే కొనసాగిస్తారు' అని ఆయన మద్దతుదారులలో ఒకరు చెప్పారు. జైట్లీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాలకు ఇక ముందు కూడా హాజరు కారని ఆయన సూచించారు. అయితే, జైట్లీ సందర్శనను రాజీ మార్గంగా బిజెపిలోని తటస్థ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంక్షోభం సమసిపోగలదని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి తన నిరసన పాతకాలపుదిగా గ్రహించారని, పరిణత మనస్సుతో తనంతట తానుగా తిరిగి మామూలు సంబంధాలను నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వర్గాలు అభిప్రాయం వెలిబుచ్చాయి.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|