బాబు తర్వాత జూనియర్?
హైదరాబాద్: ఎన్టీఆర్ తరువాత ఎవరు? అన్న ప్రశ్న తలెత్తకముందే ఆయన్ను పక్కకు తప్పించి, తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, వివాదాస్పదమైన మరో సరికొత్త చర్చకు ఇప్పుడు తెర తీశారు. చంద్రబాబు తరువాత జూనియర్ ఎన్టీఆరే అని పార్టీలో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. యువరత్న బాలకృష్ణ ఎన్నికల ప్రచారం బాగుందంటూ మొదట్లో మురిసిపోయిన తెలుగుదేశం నాయకులు, ఇప్పుడంత ధాటీగా బాలయ్య మాట్లాడలేక పోతున్నారని, పార్టీ ప్రచారానికి అది మైనస్ పాయింటని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా తొణక్కుండా వారం రోజులుగా ప్రచారం సాగించడం, ఇప్పటికీ ఆయన స్వరంలో ఏ మార్పు లేకపోవడంతో తెలుగుదేశం భావి నాయకుడు జూనియరే అని చెప్పుకుంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందిన తెలుగుదేశం నాయకులు కూడా ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా పార్టీకి కాబోయే నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని అనుకుంటున్నారు. ఆ మధ్య యువగర్జన తరువాత తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కొంత పెరిగింది. ఆ తరువాత బాలకృష్ణ ప్రచారానికి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కనిపించిన ఉత్సాహం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని చూశాక ద్విగుణీకృతం అయింది. చివరకు చంద్రబాబు కూడా1982లో ఎన్టీ రామారావు ప్రచారానికి కనిపించిన స్పందన కంటె జూనియర్ ప్రచారానికి ఎక్కువగా ఉందని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 20 March, 2009
|