'రాజ్యం' జయభేరి సక్సెస్!
హైదరాబాద్: రాజదానిలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ ప్రజారాజ్యం పార్టీ నిర్వహించిన ప్రజా విజయభేరి విజయవంతమయింది. తెలంగామలో ఆ పార్టీ మొట్టమొదటిసారిగా నిర్వహించిన సభకు, కోస్తా(రాజమండ్రి), రాయలసీమ(తిరుపతి)సభలకు వచ్చిన విధంగానే జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీ నిర్వహించే ఆఖరి సభ ఇదేనని నాయకులు ఇదివరకే ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజారాజ్యం బలహీనంగా ఉందనే ప్రచారం తప్పని నిరూపించేందుకు ఆ పార్టీ చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించిందని చెప్పవచ్చు. పార్టీకి తెలంగాణలో కొంచెం ఊపు తీసుకురావడానికి ఈ సభ విజయం దోహదం చేసింది. అయితే భారీ సంఖ్యలో హాజరైన జనాన్ని సమ్మోహితులను చేసే విధంగా చిరంజీవి ప్రసంగించలేక పోయారన్నది నిర్వివాదం. కాగ్రెస్ పార్టీ కంటె మహాకూటమి భాగస్వామ్య పార్టీలపైనే ఎక్కువగా విమర్శనాస్త్రాలను సంధించారు.
గతంతో పోలిస్తే చిరంజీవి ప్రసంగాలు కాస్త మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. రాజకీయ ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయడంలో సఫలీకృతులైనప్పటికీ, తమ పార్టీకే ఎందుకు ఓటు వేయాలో స్పష్టంగా వివరించలేకపోయారు. అలాగే ఆ పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటున్న గుర్తు సమస్యపై ఏర్పడిన అయోమయాన్ని ఎప్పుడు, ఎలా తొలగిస్తారో చెప్పడం మాట అటుంచి కనీసం దాని ప్రస్తావన అయినా చేయలేదు. సభకు ముందు హామీ ిచ్చిన మేరకు తెలుగుదేశం ప్రకటించిన ప్రజాకర్షక పథకాలకు దీటుగా ఈ సభలో కొత్త పథకాలను ప్రకటించలేదు సరికదా, పాతవాటినే ఏకరువు పెట్టారు. అలాగే ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఎదురుచూసిన నవ తెలంగాణ నాయకులకు కూడా నిరాశే మిగుల్చుతూ, గతంలో చేసిన ప్రకటనలనే పునశ్చరణ చేశారు.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|