చైనా 'అలీబాబా' వస్తున్నాడు!
'ఈ సంక్షోభం భవిష్యత్తులో నివసించే ఏ దేశానికైనా ఒక సదవకాశం. గతంలో నివసించే ఏ దేశానికైనా విపత్తు' అని అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జాక్ మా 'హిందుస్థాన్ టైమ్స్' పత్రిక విలేఖరితో అన్నారు. ప్రపంచంలోని కొనుగోలుదారులను, విక్రేతలను అనుసంధానించే అత్యంత పెద్దదైన ఆన్ లైన్ మార్కెట్ సంస్థ అలీబాబా. 'ఇండియా, చైనాలకు ఇది మహదవకాశం' అని ఆయన పేర్కొన్నారు. 'గ్లోబలైజేషన్ వల్ల కలిగిన బాధ' అయిన ఈ సంక్షోభం ఎప్పుడు అంతమవుతుందో ఆయన సూచించడం లేదు. కాని దీని నుంచి ముందుగా కోలుకునేది ఇండియా, చైనా దేశాలేనని ఆయన విశ్వసిస్తున్నారు. 'ఈ ఎన్నికలు సంక్లిష్ట సమయంలో జరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలలో ఇండియా చూసిన వృద్ధి రేటును రానున్న ప్రభుత్వం ఏవిధంగా కొనసాగించగలుగుతుందో తెలుసుకుందామని ప్రతి ఒక్కరూ ఆత్రుతతో ఉన్నారు' అని జాక్ మా చెప్పారు.
దాదాపుగా ప్రతి పెద్ద సంస్థ కూడా తమ సిబ్బంది సంఖ్యను కుదిస్తున్న ఈ సమయంలో తన సంస్థలలో దాదాపు 5000 మందిని చేర్చుకోవాలని మా అనుకుంటున్నారు. ప్రపంచ ఇ- వాణిజ్యానికి సంబంధించిన భావి టెక్నాలజీల రూపకల్పన నిమిత్తం కోర్ ఇంటర్నెట్ ఇంజనీర్లను కూడా 'గణనీయ సంఖ్య'లో ఎంపిక చేయాలని ఆయన యోచిస్తున్నారు. 'అత్యుత్తమ ఐటి ప్రవీణులు ఉన్న ప్రపంచ దేశాలలో ఇండియా ఒకటి. అందువల్ల ఆ అర్హతలకు సరిపోయే ఎవరినైనా తీసుకోవాలని మేము ఆసక్తితో ఉన్నాం' అని జాక్ మా తెలిపారు.
అంతర్జాతీయంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న అలీబాబా మార్కెట్ ప్రస్తుతం ఇండియాయే. ఆర్థిక మాంద్యం సమయంలో బడ్జెట్ ల కోత జరిగిన వాణిజ్యవేత్తలలో అధిక సంఖ్యాకులకు చౌకగా ఇ-వాణిజ్యం సాగించడానికి ఇంటర్నెట్ అవసరం ఉంది. 'ఇ-వాణిజ్యంపై ఈ సంక్షోభం ప్రభావం పడలేదు' అని మా చెప్పారు. 'వాస్తవానికి ముఖ్యంగా ఇండియా, చైనా దేశాలలో ఇ-వాణిజ్యం మరింత వేగంగా వృద్ధి చెందగలదు. ఖర్చులు తగ్గించుకుని, ఎక్కువ మంది ప్రపంచ సప్లయిర్లు, కొనుగోలుదారులకు అందుబాటులోకి రావడానికి ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించుకోవాలని కోరుకునే వారు ఉండడమే ఇందుకు కారణం. ఆసియాలో అలీబాబా సంస్థకు సంబంధించి అంతర్జాతీయంగా ఇంగ్లీష్ మాట్లాడే మార్కెట్ కేంద్రమైన ఇండియాలోనే అత్యధిక సంఖ్యలో యూజర్లు ఉన్నారు' అని మా తెలియజేశారు.
చైనాను ఆర్థికంగా కుంగదీసిన సాంస్కృతిక విప్లవం (1966-76) కాలంలో పెరిగిన, చిల్లరమల్లర ఉద్యోగాలు చేసిన, ఇంగ్లీష్ అధ్యాపకుడుగా కూడా పని చేసిన జాక్ మా ఇంకా మాట్లాడుతూ, '1999లో తాను అలీబాబా సంస్థను స్థాపించినప్పుడు ఇండియాకు, చైనాకు మధ్య 'చాలా సారూప్యతలు' ఉన్నాయని చెప్పారు. అయితే, ఇండియాలో ఇప్పటికీ విస్తారమైన బ్రాడ్ బ్యాండ్ అందుబాటులోకి రాకపోవడం క్రితం సంవత్సరం ఇన్ఫోమీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తన బృందాన్ని ఆశ్చర్యపరచిందని ఆయన తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 22 March, 2009
|