గుర్తుపై 'రాజ్యం' డైలమా!
హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభం అయిపోయినప్పటికీ,మొదటి దశలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలకు అభ్లర్ధులు, వారి గుర్తుల విషయం తేలక ప్రజారాజ్యం పార్టీ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. రెండు రోజుల్లో అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చెప్పారు. నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ముగిసే లోగా ఉమ్మడి గుర్తు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి ఉమ్మడి గుర్తు కేటాయించాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇదే విషయమై ఇదివరకు హైకోర్టుకు రెండు సార్లు వెళ్లి, రెండు పిటిషన్లూ ఉపసంహరించుకుంది. ఉమ్మడి గుర్తు వ్యవహారం ఇప్పుడప్పుడే ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అభ్యర్ధుల జాబితా విడుదలను కూడా ఆలస్యం చేస్తోంది. అయితే నీమినేషన్ల గడువు దగ్గరపడుతుండడంతో, గుర్తు సమస్య తేలేలోగానే అభ్యర్ధుల జాబితా విడుదల చేయక తప్పక పోవచ్చు.
అయితే ఎన్నికలు దగ్గరపడుతున్నందున సుప్రీం కోర్టు ప్రజారాజ్యం గుర్తు కేసును అత్యవసర ప్రాతిపదికన విచారణకు స్వీకరించి, పార్టీ వాదనలు వినవచ్చని సీనియర్ నాయకుడొకరు ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో కేసు పురోగతిని గమనించాక ప్లాన్-బి ని అమలుపరచే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలు ప్రజారాజ్యంలో విలీనమై, తమ గుర్తును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే సుప్రీం కోర్టు నిర్ణయం కోసం ఈ నెల 26 వరకు వేచి చూసి, అనుకూలమైన తీర్పు వెలువడకపోతే విలీనం ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఆయన వివరించారు. అయితే గుర్తుల కేటాయింపు విషయంలో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందని, ప్రజారాజ్యంవంటి పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించాలని నిరూపించడమే తమ లక్ష్యమని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 24 March, 2009
|