రేణుకకు'పల్లేరు'మీద నడకే!
విజయవాడ: కేంద్ర మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకోవడం కంటె పబ్లిసిటీ జిమ్మిక్కులు చేయడంలో నేర్పరి ఆమె. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను పక్కన కూర్చోబెట్టుకుని ట్రాక్టర్ నడిపారు. ఇటీవల సోనియా గాంధీ కొత్తగూడెం సందర్శించినప్పుడు నెమలీకలు కొప్పులో పెట్టుకుని డాన్స్ చేసి జనాలను ఉర్రూతలూగించారు. ఎప్పుడో సందర్భం వస్తే తప్ప నియోజకవర్గాన్ని సందర్శించని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారపాటి రేణుకా చౌదరిని ఖమ్మం వాసులు 'విజిటింగ్ ప్రొఫెసర్' అని పిలుస్తారు. గత రెండుసార్లు అక్కడి నుండి పార్లమెంటుకు ఎన్నికై, హ్యాట్రిక్ కోసం బరిలో అడుగు పెడుతున్న రేణుకకు ఈసారి అంతా 'పల్లేరు'మీద నడకే! క్రితంసారి ఆమె చేసిన ఎన్నికల వాగ్దానాలు ఇంకా గాలిలో తేలియాడడమే అందుకు కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. సిట్టింగ్ లకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లు నిర్ణయించుకుంటే ఆమెకు ఓటమి తప్పదని చెబుతున్నారు.
అయితే మహిళా శిశు సంక్షేమ మంత్రిగా తన హయాంలో పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలలో ప్రాసెస్ చేసిన ఆహారం సమకూర్చాలన్న తన నిర్ణయాన్ని తుచ తప్పకుండా అమలు పరచారు రేణుకా చౌదరి. నిపుణులు, పలువురు కేంద్ర మంత్రులు వద్దన్నా వినిపించుకో లేదామె. ఒక్కో విద్యార్ధి భోజనానికి సగటు ఖర్చును రూ.2.06 నుంచి రూ.4.21కి పెంచుతూ, తన పదవీకాలం చివరి రోజుల్లో ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వు ఇంకా చాలా చోట్ల అమలులోకి రావలసి వుంది. ఇక ఖమ్మం నియోజకవర్గం విషయానికి వస్తే గత ఐదేళ్లలో తమపట్ల ఆమె వ్యవహారశైలి ఓటర్లకు ఏమాత్రం నచ్చలేదు. వారికిచ్చిన వాగ్దానాలు అమలుకాలేదు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి ఆమె మూడోసారి కూడా నెగ్గితే హ్యాట్రిక్ కొట్టినట్టవుతుంది.
Pages: 1 -2- News Posted: 24 March, 2009
|