అలిగిన 'చేవెళ్ళ' చెల్లమ్మ!
చేవెళ్ళ: రానున్న ఎన్నికల కోసం ప్రచారానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి శ్రీకారం చుట్టారు కాని ఆ సభకు జనం హాజరు స్థాయి పలుచగా ఉంది. తనకు, తన కుమారునికి తాము కోరుకున్న స్థానాలకు టిక్కెట్లను ఇవ్వకపోవడం పట్ల ఆయన 'చేవెళ్ళ చెల్లెలు', మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిగిన ఆగ్రహం పర్యవసానమే జనం తక్కువ సంఖ్యలో హాజరు కావడం. సభ నిర్వహణను గంటకు పైగా ఆలస్యం చేశారు. కాని సభా స్థలి నిండలేదు. జనం తక్కువ సంఖ్యలో హాజరు కావడానికి సంజాయిషీ ఇవ్వవలసిందిగా సబితా రెడ్డిని ముఖ్యమంత్రి అడిగినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
నియోజకవర్గాల పునర్విభజనతో చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్ ను షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. కొత్తగా సృష్టించిన చేవెళ్ళ లోక్ సభ స్థానాన్ని తన కుమారునికి ఇవ్వాలని కోరిన సబితా రెడ్డి తాను రాజేంద్రనగర్ సెగ్మెంట్ కు మారాలని కోరుకున్నారు. కాని ఆ కోర్కెలు రెండింటినీ పార్టీ నాయకత్వం తోసిపుచ్చి సబితా రెడ్డిని మహేశ్వరం శాసనసభ స్థానంలో నిలబెట్టింది. తన అనుయాయుడు వెంకట స్వామికి చేవెళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్ టిక్కెట్ ఇవ్వాలని సబితా రెడ్డి సిఫార్సు చేశారు. కాని ఈ కోర్కెను కూడా పార్టీ తిరస్కరించింది. ఈ స్థానానికి టిక్కెట్ యాదయ్యకు లభించింది.
సభలో వేదికపైనే ముఖ్యమంత్రి ముందే వెంకటస్వామి ఒక్కసారిగా భోరుమన్నారు. వెంకటస్వామిని డాక్టర్ రాజశేఖరరెడ్డి సముదాయిస్తుంటే సబితా రెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి మౌనంగా తిలకించారు. కాకపోతే డాక్టర్ రాజశేఖరరెడ్డికి ఉపశమనం కలిగించిన ఏకైక అంశమేమంటే ఆయన చేవెళ్ళలో దిగగానే ఆకాశం మేఘావృతమై, బహిరంగ సభ ముగియగానే వర్షం కురవడం. '2004లోఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వచ్చినప్పుడు ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. అదే స్థితి పునరావృతం కావడం వింతే' అని సబితా రెడ్డి పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 26 March, 2009
|