చెదరిన 'అమెరికా కల'
బెంగళూరు: 'కల చెదిరింది, కథ మారింది, కన్నీరే...ఇక మిగిలింది' అన్నట్లయ్యింది అమెరికా పరిస్థితి. దశాబ్దాల తరబడి భారతీయ యువకుల సుందర స్వప్నంగా, లక్ష్యంగా కొనసాగిన అమెరికా గడ్డ ప్రస్తుతం వైమనస్యతకు గురయ్యింది. అమెరికా ఆఫర్ అంటెనే 'వద్దు, ఆ అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అని యువత ప్రవర్తిస్తోంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకమైన అమెరికా విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రలై, వాల్ స్ట్రీట్ లేదా సిలికాన్ వాలీలో ఉద్యోగం చేస్తూ విలాసాల్లో కాలం గడిపేయాలని భారతీయ యువకులు కలలు కనేవారు. ప్రస్తుతం అమెరికా ఒక పీడకలగా వారిని వెంటాడుతోంది. అక్కడి పరిస్థితులు యువత కలవరపెడుతున్నాయి. అమెరికా అంటే 'వద్దు బాబాయ్' అని యువత అంటోంది.
భారత దేశంలో సరళీకరణ విధానాలు వెల్లువెత్తిన 2001 నుండి అమెరికా విశ్వవిద్యాలయాలు, కాలేజీ క్యాంపస్ ల్లోని విదేశీ విద్యార్ధుల్లో 15 శాతం భారతీయ యువతీయువకులేనని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అయితే, ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తి అమెరికా ద్రవ్య సంస్థలు, బ్యాంకులు, ఆటోమొబైల్ దిగ్గాజాలతో సహా పలు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థలు కుదేలవడంతో అమెరికా సుందర స్వప్నం కాస్తా పీడకలగా మారింది. భారతీయ యువతీ యువకుల్లో పలువురు స్వదేశీ విశ్వవిద్యాలయాల్లోనే చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
అమెరికా నష్టపోవడం భారత దేశానికి లాభదాయకంగా పరిణమించిందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మేధావుల వలస (బ్రెయిన్ డ్రెయిన్) కాస్తా మేధావుల ప్రతి వలస (రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్)గా అవతరించింది. దాంతో ఆసియాలో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత దేశానికి అత్యధికంగా లాభం చేకూరే అవకాశముందని పలువురు విశ్లేషకులు తెలిపారు. అత్యంత తెలివైన, నైపుణ్యంగల ప్రవాస భారతీయులంతా భారత దేశ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడంపై తమ సర్వశక్తులు కేంద్రీకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ క్రమం ప్రారంభమైంది కూడా.
Pages: 1 -2- -3- News Posted: 26 March, 2009
|