బాలయ్య భుజాలపైనే భారం
మరొక వైపు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చూస్తూ మహా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్న చంద్రబాబు ఈ నెల 29 లేదా 30 నుంచి తన పర్యటనలను ప్రారంభించాలని సంకల్పించారు. హెలికాప్టర్ ద్వారా రోజూ ఆరేడు నియోజకవర్గాలలో పర్యటించాలని ఆయన నిర్ణయించారు. ఇందు నిమిత్తం రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన తెప్పిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలలో చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు విడివిడిగా పర్యటిస్తారు. ఈ ప్రాంతంలోని 119 నియోజకవర్గాలలో కనీసం 80 నుంచి 90 నియోజకవర్గాలలో పర్యటించాలనేది వారిద్దరి లక్ష్యం.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ పర్యటించి వచ్చినందున మిగిలిన ప్రాంతాలలో తన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. 'మీ కోసం' చైతన్య యాత్రలో మిగిలిపోయిన నియోజకవర్గాలలో తొలుత పర్యటించి ఆ తరువాత తక్కి న ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల బరిలోకి దిగని సీనియర్ నాయకులను, రాజ్యసభ సభ్యులను ఒక్కొక్క ప్రాంతానికి ఒకరిని ఇన్ చార్జిగా నియమించి ప్రచార బాధ్యతలను నిర్వహించాలని నిర్ణయించారు.
మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలైన సిపిఐ, సిపిఎం జాతీయ అగ్ర నేతలను ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు రప్పించాలని భావిస్తున్నారు. ఇప్పటికే వారితో మాట్లాడిన పార్టీ నాయకులు వారి ప్రచార కార్యక్రమాలు నిర్వహించే తేదీలపై దృష్టి సారించారు. వామపక్షాల అగ్రనేతలు ప్రకాశ్ కారత్, ఎ.బి. బర్ధన్, సీతారామ్ ఏచూరి ప్రభృతులను ఎన్నికల ప్రచారం కోసం రప్పించాలని మహాకూటమి భావిస్తుండగా తృతీయ ఫ్రంట్ లో భాగస్వాములైన ఇతర పార్టీల నాయకులను కూడా రాష్ట్రానికి పిలిపించి అధికార కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై వారితో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్, అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలలో మరాఠీ, కన్నడం, ఒరియా, తమిళ భాషలు మాట్లాడే వోటర్లు అధికంగా ఉన్నందున ఆయా రాష్ట్రాల నాయకులను కూడా ఇక్కడికి రప్పించాలని మహాకూటమి ప్రతిపాదించింది. ఈ నాయకుల పర్యటన కార్యక్రమాలను టిడిపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామమోహనరావు రూపొందిస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 28 March, 2009
|