అంతా 'మహా' మౌనులే!
హైదరాబాద్ : మహా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకుల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాని ఆ వివరాలను ప్రకటించకుండా వారు మౌనముద్ర దాలుస్తున్నారు. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఏ స్థితిలో ఉందో ఎవరూ బహిరంగంగా ప్రకటించకపోవడంతో ఆయా పార్టీల నాయకులలో ఆందోళన అంతకంతకూ తీవ్రం అవుతోంది.
లోక్ సభా స్థానాల వరకు సర్దుబాటు సాఫీగానే సాగింది. అసెంబ్లీ స్థానాల పంపకంలోనే కూటమి పార్టీల మధ్య పేచీ వచ్చింది. ఏ స్థానానికి ఏ పార్టీ పోటీ చేస్తుందో కూటమి పార్టీల నాయకులకే అంతుపట్టడం లేదు. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు గడువు సమీపిస్తున్నా ఇప్పటి వరకు అధికారికంగా సీట్ల వివరాలను కూటమి నాయకులు వెల్లడించలేదు.
తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. కూటమి పార్టీల మధ్య వివాదాస్పదంగా మారిన సీట్లపై వారు చర్చించారు. అయితే, ఈ చర్చలలో ఏ నిర్ణయం తీసుకున్నారో రెండు పార్టీల నాయకులు బయటకు చెప్పడం లేదు. కాగా, శుక్రవారం చంద్రబాబుతో సిపిఎం నాయకుడు బి.వి. రాఘవులు ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
మహా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరిందని భాగస్వామ్య పార్టీలు అన్నీ చెబుతున్నప్పటికీ అసలు ఏ పార్టీ ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుంది, ఏయే స్థానాలకు పోటీ చేస్తుంది అనేది ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అనధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం, ఉభయ కమ్యూనిస్టులకు చెరి రెండు లోక్ సభ స్థానాలు, 16 అసెంబ్లీ స్థానాలు, టిఆర్ఎస్ కు తొమ్మిది లోక్ సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తున్నది.
సిపిఎం పది మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. టిఆర్ఎస్ 42 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాగా టిడిపి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కూటమిలోని పార్టీలు ఏయే సీట్లకు పోటీ చేస్తాయో ముందుగానే ప్రకటిస్తే పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావచ్చుననే ఉద్దేశంతోనే ఆ పార్టీలు సీట్ల వివరాలను వెల్లడి చేయలేదని భావిస్తున్నారు. టిడిపి, టిఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన స్థానాల విషయంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి నిరసనలను ఎదుర్కొంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 28 March, 2009
|