పార్టీ కార్యాలయంలో అయితే అల్లర్లు జరిగేందుకు అవకాశం ఎక్కువ ఉంటుందని ఇంటిలోనే ఉండి చంద్రబాబు రాజకీయం నడుపుతున్నప్పటికీ ఇంటి వద్ద కూడా పోరు తప్పడం లేదు. అధిక సంఖ్యలో ఇంటి వద్ద చేరిన కార్యకర్తలు చివరకు బాబుకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. టిఆర్ఎస్ కు సీటు కేటాయించవద్దని కోరేవారు కొందరు, తమకు టిక్కెట్ ఇవ్వకపోతే కదిలేది లేదనేవారు మరికొందరు నినాదాలు చేస్తున్నారు. చివరకు చర్చల కోసం కెసిఆర్ వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇంటికి చాలా దూరంగానే మీడియాను ఉంచుతున్నారు. అయినప్పటికీ ఇంటి వద్ద గొడవకు ప్రచారం తప్పడం లేదు.
ఇక టిఆర్ఎస్ లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి సైతం అవమానం తప్పలేదు. ఒక్క మహిళకు కూడా సీటు ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టిఆర్ఎస్ మహిళా నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి గుడ్డలతో ముసుగు వేశారు. టిఆర్ఎస్ జాబితాలో వనపర్తి నియోజకవర్గానికి ఏకైక మహిళా అభ్యర్థిని ప్రకటించారు. అయితే, ముందుగా అనుమతి లేకుండానే కెసిఆర్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించారని అంటూ చంద్రబాబు ఆ నియోజకవర్గంపై మెలిక పెట్టారు. దానితో ఆ మహిళకు కూడా టిక్కెట్ ఇవ్వలేదని టిఆర్ఎస్ మహిళలు ఆందోళనకు దిగారు. ఉద్యమంలో ఉంటామని చెబుతూనే అవసరమైతే తెలంగాణ మహిళా పార్టీని ఏర్పాటు చేసుకుని ఉద్యమిస్తామని కొంత మంది మహిళలు ఆవేశంగా ప్రకటించారు. కొంతసేపు తెలంగాణ భవన్ లో ఆందోళనకు దిగిన మహిళలు చివరకు కెసిఆర్ నివాసానికి వెళ్ళి అక్కడే బైఠాయించారు. మరొక వైపు జిల్లాలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన గళాలు వినిపిస్తున్నాయి. సిరిసిల్ల నుంచి కెసిఆర్ తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వడాన్ని నియోజకవర్గం కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని వారు సవాల్ విసురుతున్నారు.