హైదరాబాద్ : రానున్న సార్వత్రిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి రైతులు నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడువు రోజు గురువారం రహస్య ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకోవలసిందిగా రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్ళు రావచ్చునని భయపడి వారు ఇలా చేశారు.
రాజకీయ పార్టీల ఒత్తిడి ఎత్తుగడలకు లొంగకుండా తప్పించుకోవడానికి వారు చివరకు తాము ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని కూడా రద్దుచేసి అజ్ఞాత ప్రదేశానికి హుటాహుటిని వెళ్ళిపోయారు. గురువారం సాయంత్రం జడ్చర్లలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాల్గొన్న బహిరంగ సభ ఆ రైతులను తమను కిడ్నాప్ చేస్తారేమోననే భయాందోళనలకు గురిచేసింది. 'అసెంబ్లీ ఉప ఎన్నికలలో బహిరంగసభ కోసం వైఎస్ వచ్చినప్పుడు రైతు అభ్యర్థులను ఎత్తుకుపోయి ఒక రోజంతా బందీలుగా ఉంచారు. ఆ సభకు భారీగా జనాన్ని సమీకరించడం కోసమే అలా చేశారు' అని ఒక స్థానికుడు చెప్పారు.
పోలేపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఇజడ్)ల కోసం తమ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయడానికే రైతులు అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. ఏ రాజకీయ పార్టీకీ ఓటు చేయాలని వారు కోరుకోవడం లేదు కనుకే వారు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఉప ఎన్నికలలో 15 మంది రైతు అభ్యర్థులు సుమారు 13 వేల ఓట్లను సంపాదించిన కారణంగానే రాజకీయ పార్టీలు తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని భయంతో వణికిపోతున్నాయి.