డిష్ టివి కార్లలో ప్రచారం
కోలకతా : జాతి పిత గాంధీజీని గుర్తు చేసుకోవడానికి, భారతదేశ శోధనకు రోడ్డు ఎక్కడానికి ఎన్నికలే సరైన సమయం. కాని ఈ దఫా రాజకీయ నాయకులు తమ వెంట తమ డ్రాయింగ్ రూమ్ ను కూడా తీసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రచార పర్వంలో మునిగిపోయిన రాజకీయ ప్రముఖులు దేశవ్యాప్తంగా సంభవించే తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తమ అధికార వాహనాలలో డిజిటల్ టివి యూనిట్లను అమర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. అటువంటి నాయకుల జాబితాలో ఎల్.కె. అద్వానీ, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, నరేంద్ర మోడి, ఎం. కరుణానిధి, ఎన్. చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వసుంధర రాజె వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అయితే తన వ్యక్తిగత రైలు బోగీలో ఈ సౌకర్యాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు.
ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్న డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) సర్వీస్ ప్రొవైడెర్ 'డిష్ టివి' సంస్థ పై జాబితాను ధ్రువీకరించింది. 'రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవలసిన అవసరం ఉంది. మేము అదే సమకూరుస్తున్నాం. సంచార సౌకర్యం రాజకీయ నాయకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది' అని డిష్ టివి ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) సలీల్ కపూర్ పేర్కొన్నారు. డిష్ టివి ప్రాంతీయ చానెల్స్ ను ప్రసారం చేస్తుంది కనుక మహాత్మా గాంధి దశాబ్దాల క్రితమే నొక్కి చెప్పిన ప్రాంతీయ సెంటిమెంట్ల గురించి రాజకీయ నాయకులు తెలుసుకోగలుగుతారని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. 'నిజమైన భారతం ఏవో కొన్ని నగరాలలో కాకుండా ఏడు లక్షల గ్రామాలలో కనిపిస్తుంది. గ్రామాలు నాశనమైనట్లయితే ఇండియా కూడా నశించిపోతుంది' అని జాతి పిత అన్నారు.
Pages: 1 -2- News Posted: 5 April, 2009
|