'రాజ్యం'లో రగులుతున్న సెగ
హైదరాబాద్: ప్రారంభంలో ప్రజలను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బలహీనపడుతున్నట్టు కనిపిస్తోంది. సరైన రాజకీయ ప్రాధాన్యం లభించకపోవడం, పార్టీ అధినాయకత్వంతో సంబంధాలు బలపడకపోవడం, సమన్వయలోపం, ఆశించిన స్థానాలు దక్కకపోవడం, టిక్కెట్ల కేటాయింపు ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు. లోక్ సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్ధులకు సంబంధించి ఎనిమిది జాబితాలు విడుదలైన నేపథ్యంలో పార్టీ అగ్రనాయకత్వంపట్ల అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. గెలుపోటముల మాట పక్కన పెట్టి, ఏమీ లేకముందే గ్రూపులు ఏర్పడి అంతర్గత వెన్నుపోటుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
సామాజిక న్యాయం నినాదంతో ఆవిర్భవించిన పార్టీ రౌడీలకు, గూండాలకు టిక్కెట్లిచ్చిందని కొందరు, ఓడిపోతామనుకున్న స్థానాలను మాత్రమే, సామాజిక న్యాయం పేరుతో బిసి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిందని మరి కొందరు, అధి నాయకుల్లో కొంతమంది చిరంజీవికి తెలియకుండా, డబ్బులిచ్చిన వారికే టిక్కెట్లిచ్చారని ఇంకొందరు ఆరోపణలు చేస్తున్నారు. అభ్యర్ధుల జాబితాలు విడుదలైన కొద్దీ రాజీనామాలు, తిరుగుబాట్లు ఎక్కువయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో మాజీమంత్రి సంగీత వెంకటరెడ్డి వంటి అనేకమంది రాజకీయ ప్రముఖులు ప్రజారాజ్యం పార్టీకి దూరమయ్యారు. పార్టీ కర్నూలు జిల్లా కో కన్వీనర్ శ్రీనివాస్ లాంటి జిల్లాస్థాయి నాయకులు కూడా చాలామంది రాజీనామా చేశారు.
Pages: 1 -2- News Posted: 6 April, 2009
|