బాబుపై కేసీఆర్ పొగడ్తలు
తెలంగాణ వాదం పస తగ్గిందని టిఆరెస్ శ్రేణులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ తెలుగుదేశం నాయకులను మించి చంద్రబాబును పొగడ్డం, అభినందనల్లో ముంచెత్తడం పార్టీవారికి ఆశ్చర్యం కలిగిస్తోంది. కెసిఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు కాని, బాబును పొగడ్డం విన్నవారు మాత్రం తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఇది కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనని కెసిఆర్ ను సమర్ధించేవారు వాదిస్తున్నారు. చంద్రబాబు మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని అని పదే పదే చెబుతూ, ఆయన తెలంగాణకు కట్టుబడి ఉండేట్టుగా చేయడమే కెసిఆర్ పొగడ్తల్లోని అసలు ఉద్దేశం అని కొందరు నాయకులు చెబుతున్నారు.
చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ వస్తుందా? అని తెలంగాణవాదులు నిలదీస్తున్న సమయంలో అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తాం అని చంద్రబాబుచేత పదే పదే చెప్పించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. అయితే ఇలాంటి ఎత్తుగడలను నమ్మడం అవివేకమని కొందరు విమర్శిస్తున్నారు. ఒక పత్రికాధిపతి భూ ఆక్రమణలమీద పెద్ద ఎత్తున ఉద్యమించి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ లకు వినతిపత్రాలు ఇచ్చిన చంద్రబాబు చివరకు అదే పత్రికాధిపతికి అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గానికి తెలుగుదేశం టిక్కెట్ ఇచ్చి దాన్ని సమర్ధించుకున్న సామర్ధ్యం గలవారని, అటువంటి వ్యక్తి ఒక మాటకు కట్టుబడి ఉంటారనుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు.
Pages: -1- 2 News Posted: 8 April, 2009
|