కేంద్రంలో 'రాజ్యం' చేయాలి!
హైదరాబాద్: జాతీయస్థాయిలో జరుగుతున్న నాలుగో కూటమి ఏర్పాటులో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కేంద్ర బిందువు కాబోతున్నారు. సామాజిక న్యాయం దిశగా వెళ్తున్న పార్టీలన్నీ చేతులు కలిపేందుకు సుముఖంగా ఉన్నాయి. ఎన్డీఓ, యుపిఎ లతో విభేదించే పార్టీలు కూటమిగా ఏర్పడుతున్నాయి. చంద్రబాబు, వామపక్షాల సారథ్యంలో ఏర్పడిన మూడో కూటమికి ఇది ఎదురుదెబ్బ కాబోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మెగా స్టార్ చిరంజీవితో సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు నాలుగు గంటలుపైగా జరిగిన వారిద్దరి చర్చల్లో భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. కేంద్రంలో వివిధ పార్టీల బలాబలాలపై అంచనాకు వచ్చి, స్థానికంగా అధికార పార్టీలతో పొసగని నాయకుల ఆలోచనలను విశ్లేషించారు. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి నాలుగో కూటమి ఏర్పాటుకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి.
లాలూ ప్రసాద్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్, రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి ఇప్పటికే నాలుగో కూటమి ఏర్పడ్డం తథ్యమని ప్రకటించాయి. ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ జాతీయ రాజకీయాల్లో మార్పును కోరుతున్నారు. తమ రాష్ట్రంలో మాయావతిని దెబ్బతీయడం ఆయన వ్యూహంలో ఒక భాగం. జాతీయ రాజకీయాల్లో ఆమెకు వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారుచేయాలని భావిస్తున్నారు. మయావతితో చంద్రబాబు కొంతకాలంగా మంతనాలు జరుపుతూ వామపక్షాలతో కలసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఈ ఫ్రంట్ లో కలవాలని మూలాయం సింగ్ ను ఆహ్వానించారు. అయితే మాయావతిని దూరంగా ఉంచాలని ఆయన పెట్టిన షరతుకు బాబు ప్రభృతులు అంగీకరించలేదు. అందువల్ల నాలుగో కూటమి ఏర్పాటే ఏకైక మార్గమని భావిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 8 April, 2009
|