పార్టీలకు విరాళాలు తగ్గాయి
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యానికి గురైన కార్పొరేట్ సంస్థలు వ్యయకర్తన చర్యలు తీసుకుంటుండడంతో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కోసం కార్పొరేట్ విరాళాలు గణనీయంగా తగ్గాయి. అంచనాలలో తేడాలు ఉండవచ్చునేమో గాని ఈ దఫా కార్పొరేట్ విరాళాలు కనీసం 20 శాతం తగ్గాయి. పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఐచ్ఛికంగా ముందుకు వస్తున్న కంపెనీల సంఖ్య తగ్గింది. కొన్ని సంస్థలైతే తమ హామీలను నెరవేర్చడానికి వెనుకాడుతున్నాయి. అయితే, ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఉందని చెప్పి ఈసారికి తమను వదలివేయవలసిందని కోరిన సంస్థలు కూడా లేకపోలేదు.
కాగా, కంపెనీలు చెపుతున్నదాని కన్నా తమకు పెద్ద దెబ్బే తగిలిందని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. కార్పొరేట్ విరాళాలు 35 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గాయని పార్టీలు చెప్పాయి. కాని 'రాజకీయ పార్టీల డిమాండ్ ఎప్పుడూ సరైన రీతిలోఉండదు' అని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఈ సంక్షుభిత సమయంలో కూడా తాము విరాళాలను 20 శాతం మాత్రమే తగ్గించామని వారు చెబుతున్నారు. 'మాకు పరిస్థితి గడ్డుగా ఉంది. ఈ కంపెనీలకు పదేపదే గుర్తు చేయవలసి వస్తోంది. కొన్ని సంస్థలు తమంతట తామే ముందుకు వస్తున్నాయి' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. బిజెపి వర్గాలు ఈ పరిస్థితి నెలకొందని అంగీకరిస్తున్నాయి. అయితే, తాము ఆర్భాటంగా ప్రచారం చేయదలచుకోవడం లేదు కనుక ఏదో విధంగా ప్రచారం సాగిస్తున్నామని ఆ వర్గాలు నిజాయితీగా చెప్పాయి.
Pages: 1 -2- News Posted: 8 April, 2009
|