హంగ్ తప్పదా?
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు, సంకీర్ణాలకు స్పష్టమైన మెజారిటీకి కావలసిన 148 సీట్లు దక్కవా? అధికార కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాలతో కూడిన మహాకూటమిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇక మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) తాను చక్రం తిప్పడానికి అటువంటి పరిస్థితే నెలకొనాలని ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండు దశల ఎన్నికలు జరగడానికి సరిగ్గా రెండు వారాల వ్యవధి ఉండడంతో రాష్ట్రంలోని వోటర్లు గతంలో అన్ని ఎన్నికలలో వలె కాకుండా ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టకపోవచ్చు.
ఇందుకు ప్రధాన కారణం గతంలో ఎన్నికలలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ జరగగా ఈ దఫా రాష్ట్రమంతటా ముక్కోణపు పోటీ జరగనుండడమే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేక ప్రభంజనమేదీ లేకపోవడం, తెలుగు దేశం పార్టీ (టిడిపి) గుప్పించిన వాగ్దానాలను నమ్మడానికి జనం సుముఖంగా లేకపోవడం, పార్టీని స్థాపించిన సమయంలో కానవచ్చిన ఊపును చిరంజీవి కొనసాగించలేకపోవడం వోటర్ల పరంగా స్పష్టమైన తీర్పు రాకపోవడానికి ఇతర కారణాలు కావచ్చునని అనుకుంటున్నారు. ఉత్తర కోస్తా ఆంధ్రలో చిట్టచివరి శ్రీకాకుళం జిల్లాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిరంజీవి రైలింజన్ మధ్యలో వేగం అందుకున్నా ధాన్యాగారం అనదగిన గోదావరి జిల్లాలలో మందగమనం సాగించింది. 68 శాసనసభ స్థానాలు ఉన్న, చిరంజీవి కులం ప్రాబల్యం గల ఈ ఐదు జిల్లాలలో పోటీ ప్రధానంగా ఆయన పార్టీకి, కాంగ్రెస్ కు మధ్యే ఉంటుంది. టిడిపి పరిస్థితి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో మెరుగ్గా ఉన్నప్పటికీ ఈ గోదావరి జిల్లాలలోనే పార్టీ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి.
Pages: 1 -2- News Posted: 9 April, 2009
|