కెసిఆర్ కు మహా తిరస్కారం!
విశాఖపట్నం: మహాకూటమి మహాసభల్లో భాగంగా ఈ నెల 13న ఇక్కడ జరిగే సభకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ ను ఆహ్వానించలేదు. తెలంగాణ కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా మహాకూటమి తరఫున కెసిఆర్ ప్రచారం చేస్తారని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే టిఆరెస్ ప్రకటించింది. అంతేకాదు, ప్రచారం చేస్తే మంచిదే కాని ఇతర ప్రాంతాల వారి మనోభావాలను గౌరవించే విధంగా కెసిఆర్ మాట్లాడాలని తెలుగుదేశం ముందుగా హెచ్చరించింది. అయితే ఇప్పుడు విశాఖ సభలో కెసిఆర్ పాల్గొనడం వల్ల మహాకూటమి అభ్యర్ధులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, నష్టమే ఎక్కువగా ఉంటుందని ఉత్తరాంధ్ర నాయకులు సూచించడంతో టిఆరెస్ ప్రతినిధుల ప్రాతినిధ్యం పట్ల కూడా మహాకూటమి నాయకులు ఆసక్తి చూపడం లేదు.
మహాకూటమిలోని నాలుగు పార్టీలు పాల్గొనే సభలు తెలంగాణకే పరిమితం అవుతాయని, ప్రాంతాల్లోని సభలకు కెసిఆర్ కాని, టిఆరెస్ ప్రతినిధులు కాని హాజరుకారని తెలుగుదేశం వర్గాలు తెలిపాయి. మహాకూటమి ఏర్పడిన తరువాత విశాక సభలో పాల్గొనాలని కెసిఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. కోస్టల్ కారిడార్ కు వ్యతిరేకంగా ఇంతకు ముందు విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొనడానికి కెసిఆర్ సిద్ధపడ్డారు. విలేఖరులను కూడా విమానంలో తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చంద్రబాబును కలిసి కెసిఆర్ విశాఖ పర్యటనకు అభ్యంతరం తెలిపారు. దాంతో కెసిఆర్ ను రావద్దని చంద్రబాబు చెప్పారు. కెసిఆర్ కు బదులుగా టిఆరెస్ ప్రతినిధులు విశాఖ సభకు వెళ్లారు.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|