మధు యాష్కీకి ఇంటి పోరు!
నిజామాబాద్: మధు యాష్కి గౌడ్ లోక్ సభ ఎన్నికలలో తన ప్రత్యర్థుల గురించి అంతగా ఆందోళన చెందడం లేదు. కాని నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో తన పార్టీ ఎంఎల్ఎల నుంచి ఎదురవుతున్న సవాల్ ను ఎలా అధిగమించాలో సంపన్న కాంగ్రెస్ ఎంపి మధు యాష్కీకి అంతు పట్టడం లేదు. 'గౌడ్ కు సొంత పార్టీ ఎంఎల్ఎలు, నాయకుల నుంచి మద్దతు కరవైంది. ఇది ఆయనకు వ్యతిరేకంగా పని చేయగలదు' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
కాంగ్రెస్ సర్పంచ్ లు, ఎంపిటిసి సభ్యులు, నిజామాబాద్ మండలంలోని ఇతర నాయకులు ఇటీవల రహస్యంగా సమావేశమై ఆయనకు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించుకున్నట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం. నాగేష్ రెడ్డి, ఇతర నాయకులు అక్కడికి హుటాహుటిని వెళ్ళి వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తన తెలంగాణ అనుకూల వైఖరితో కొద్ది కాలంలోనే అందరి నోళ్ళలోను నానిన మధు యాష్కి గౌడ్ జిల్లా పార్టీ ఎంఎల్ఎల అభిమానాన్ని చూరగనడంలో విఫలమయ్యారని, దానితో ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురవుతున్నదని పేరు వెల్లడికి ఇష్టపడని మరొక కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.
మధు యాష్కి న్యూఢిల్లీలోను, హైదరాబాద్ లోను, తనకు వ్యాపార ప్రయోజనాలు ఉన్న అమెరికాలోను ఎక్కువ కాలం గడుపుతున్నందున ఆయన పార్టీ కేడర్ కు, వోటర్లకు దూరమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 'వైఎస్ఆర్ వ్యతిరేకిగా గౌడ్ కు ముద్ర పడినందున, తనకు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువు అని ఎంపి బాహాటంగా ప్రకటించినందున ఆయనపై ఎంఎల్ఎలు ఆగ్రహంతో ఉన్నారు' అని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|