పీఆర్పీ బెదురు పోయింది!
హైదరాబాద్: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ)కి 30కి మించి సీట్లు, 15 శాతానికి మించి వోట్లు రావని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ (టిడిపి) విశ్వసిస్తున్నాయి. పిఆర్పీ తన వోటు బ్యాంకుపై ప్రభావం చూపవచ్చునని రెండు పార్టీలూ అంగీకరిస్తున్నాయి. అయితే, ఆ ప్రభావం రెండవ పార్టీపైనే అధికంగా ఉంటుందని కాంగ్రెస్, టిడిపి అంటున్నాయి. టిడిపి వోట్లలో ఐదు నుంచి ఆరు శాతం వరకు సీట్లు పిఆర్పీకి పోవచ్చునని, ఆ పార్టీకి 12, 15 శాతం మధ్య వోట్లు రావచ్చునని టిడిపి ప్రధాన అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిఆర్పీకి మిగిలిన సీట్లు కాంగ్రెస్ నుంచి రావచ్చునని ఉమ్మారెడ్డి సూచించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, ప్రజారాజ్యం పార్టీకి సుమారు 15 శాతం వోట్లు రావచ్చుని టిడిపి పది శాతం వోట్లను కోల్పోవచ్చునని, మిగిలినవి కాంగ్రెస్ నుంచి పిఆర్పీకి రావచ్చునని అన్నారు. అయితే, తెలంగాణలోను, రాయలసీమలోని చాలా సెగ్మెంట్లలోను ప్రజారాజ్యం ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని ఆ నాయకులిద్దరూ సూచించారు. కొన్ని కులాలు, వర్గాలలో తనకు గల పలుకుబడి కారణంగా పీఆర్పీ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా ప్రాంతానికే పరిమితం కాగలదని వారు అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: 1 -2- News Posted: 10 April, 2009
|