కేసీఆర్ కు ఎదురుగాలి!
కరీంనగర్: ప్రత్యేక తెలంగాణ సమస్యపై తన సీటుకు రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నికలను ఆయన తమపై రుద్దినప్పటికీ మూడు సార్లు ఆయనకు, ఆయన పార్టీకి వారు బాసటగా నిలిచారు. కాని ఈ పర్యాయం ఆయన వారిని వదలి తన స్థానంలో పరాయి ప్రాంతవాసిని నిలబట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వారిని త్యజించి, పరాయి వ్యక్తిని నిలబెట్టిన పర్యవసానంగా కరీంనగర్ లోక్ సభ సీటును తిరిగి గెలుచుకోవడం టిఆర్ఎస్ కు గగనకుసుమం అవుతున్నది. క్రితం సంవత్సరం మే నెలలో మూడవ పర్యాయం కెసిఆర్ ను ఎన్నుకున్నప్పుడు మెజారిటీని 15,765 వోట్లకు తగ్గించడం ద్వారా తమ సహనం నశిస్తున్నదనే సంకేతాలను కరీంనగరం నియోజకవర్గం వోటర్లు ఆయనకు పంపారు.
'ఐదు సంవత్సరాల గడువులో కొద్దికాలం మాత్రమే మిగిలి ఉండగా గత రెండు ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఈసారి జరిగేవి సార్వత్రిక ఎన్నికలు కనుక కెసిఆర్ తిరిగి ఇక్కడి నుంచే పోటీ చేయగలరని మేము నమ్మకంతో ఉన్నాం. కాని ఆయన మమ్మల్ని వదలిపెట్టి షాక్ కలిగించారు. అది చాలదన్నట్లుగా స్థానికేతరుడు బి. వినోద్ కుమార్ ను నిలబెట్టారు. నేను ఈసారి కాంగ్రెస్ కు వోటు వేస్తాను. ఇదే అభిప్రాయంతో ఇంకా చాలా మంది ఉన్నారు' అని జగిత్యాల వాసి ఆర్. వేణుగోపాలరావు చెప్పారు. వినోద్ కుమార్ వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన టిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపి.
తెలంగాణ అంశానికి జాతీయ ప్రాధాన్యం తీసుకువచ్చిన ఘనత కెసిఆర్ దేననడంలో సందేహం లేదని స్థానికులు అంటున్నారు. అయినా, కెసిఆర్ లేకుండా తెలంగాణ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా కొనసాగించడం వినోద్ కుమార్ కు కష్టమే. 'తాను తెలంగాణను సాధించలేకపోయినందున నాలుగవ పర్యాయం కరీంనగర్ వోటర్ల ఎదుటికి రాలేక కెసిఆర్ పారిపోయారు. వోటర్లలో ఆగ్రహం ఎంత ఎక్కువగా ఉందంటే, స్థానిక టిఆర్ఎస్ నాయకులందరూ వారి ముందుకు రావడానికి వెనుకాడుతున్నారు' అని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 11 April, 2009
|