కేసీఆర్ కు ఎదురుగాలి!
రంగంలో కెసిఆర్ లేకపోవడంతో ఈ నియోజకవర్గంలో తమ విజయావకాశాల పట్ల కాంగ్రెస్ వర్గాలు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులు తమ గెలుపు కోసం నాలుగు అంశాలపై ఆదారపడుతున్నారు. 'మొదటిది - కెసిఆర్ రంగంలో లేకపోవడం. రెండవది - ప్రభాకర్ బిసి అభ్యర్థి. టిఆర్ఎస్, ప్రజారాజ్యం అభ్యర్థులు బిసిలు కారు. మూడవది - టిఆర్ఎస్ వరంగల జిల్లా నుంచి అభ్యర్థిని తీసుకువచ్చింది. ఇక చివరగా ప్రభాకర్ కొత్త అభ్యర్థి. ఎటువంటి కళంకమూ లేనివాడు' అని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఒకరు పేర్కొన్నారు.
కరీంనగర్ తో సహా ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో తెలంగాణ సెంటిమెంట్ 2008 మే ఎన్నికలలో కనిపించినంతగా లేకపోవడం కూడా అధికార పార్టీకి సంతోషం కలిగిస్తున్నది. ఇక టిఆర్ఎస్ కు పరిస్థితిని మరింత గడ్డుగా మారుస్తూ కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ లో బలమైన టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి బరిలో నిలిచారు. కాంగ్రెస్ విజయావకాశాలను ఇది కూడా పెంచుతున్నది.
క్రితం సారి కెసిఆర్ గెలిచినప్పుడు మెజారిటీ 15 వేల పైచిలుకు వోట్లు మాత్రమేనని కూడా కాంగ్రెస్ మేనేజర్లు పేర్కొంటున్నారు. 'అంతకుముందు కెసిఆర్ రెండు లక్షల వోట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఆతరువాత ఉప ఎన్నికల సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి ఆ మెజారిటీని గణనీయంగా తగ్గించగలిగారు. టిఆర్ఎస్ నుంచి కరీంనగర్ సీటును మేము గెలుచుకునేందుకు మాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఉత్సాహంతో చెప్పారు.
రంగుల టివిలు, నగదు బదలీ పథకం వంటి ప్రతిపక్షాల హామీల కన్నా ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమ పార్టీకే అవకాశాలను మెరుగుపరచగలవని కూడా కాంగ్రెస్ ఆశిస్తున్నది. కరీంనగర్ లో కనుక కాంగ్రెస్ విజయం సాధించగలిగితే అది కెసిఆర్ కు చెంపపెట్టు కాగలదు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తాను మాత్రమే పాటు పడుతున్నానన్న కెసిఆర్ వాదనకు గండి కొట్టినట్లు కాగలదు.
Pages: -1- 2 News Posted: 11 April, 2009
|