ఉండవల్లికి గండం!
కాకినాడ: రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కంటె తెలుగుదేశం, ప్రజారాజ్యం అభ్యర్ధులు మురళీ మోహన్, కృష్ణంరాజు ప్రచారంలో ముందంజలో వున్నారు. ఇద్దరూ స్థానికేతరులే అయినప్పటికీ నామినేషన్లు దాఖలు చేసిన రెండు మూడు రోజుల్లోనే స్థానికంగా పట్టు సంపాదించుకోగలిగారు. అసమ్మతివాదులను బుజ్జగించి తమవైపు మరల్చుకున్నారు. కాంగ్రెస్ కు అసమ్మతి బెడద లేనప్పటికీ ప్రచారంలో బాగా వెనకబడిపోయింది. అరుణ్ కుమార్ ఐదేళ్లలో జాతీయస్థాయికి చేరుకుని, ఎఐసిసిలో ముఖ్య నాయకుడిగా మారారు. ప్రధానంగా సోనియా, రాహుల్ గాంధీల ప్రసంగాల అనువాదకుడుగా పేరుపొందారు.
ఇటీవలి కాలంలో సోనియా, రాహుల్ తరచు రాష్ట్రంలోపర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వారి సభలకు హాజరై ప్రసంగాలను అనవదించడానికే అరుణ్ కుమార్ కు సమయం సరిపోతోంది. ఈ లోగా మురళీ మోహన్, కృష్ణంరాజు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మురళీ మోహన్ ఏడు అసెంబ్లీ నియేజకవర్గాల్లో ఒకసారి పర్యటించగా, కృష్ణంరాజు మరో ఒకటి రెండు రోజుల్లో తొలివిడత పర్యటన పూర్తి చేసుకోనున్నారు. మరోసారి పర్యటనలకు ఇద్దరూ సిద్ధమవుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీల అభ్యర్దులు కూడా వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇద్దరికీ సినీ గ్లామర్ ఉండడంతో వారి గ్లామర్ తో తమకు ఓట్లు పంట పండించుకోవాలని అసెంబ్లీల అభ్యర్ధులు ఆశిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 12 April, 2009
|